కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి ప్రవేశించింది.. తోసేయండి అంటూ సీఎం!!

 

ఏపీ అసెంబ్లీ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేసినా, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెన్షన్ కు గురైన ఆయన.. మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యతో కలిసి అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. తాము అనుకున్నదంతా అయిందని, కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి ప్రవేశించిందని ఆరోపించారు. 

ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సస్పెండ్‌ చేశారని విమర్శించారు. హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?అని ప్రశ్నించారు. తన స్థానం నుంచి కదల్లేదని, ఎవరితోనూ దుర్భాషలాడలేదని అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలపై తాము ఎక్కడ నిలదీస్తామోనన్న భయంతో సభ నుంచి గెంటేశారని అన్నారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా?అని దుయ్యబట్టారు. తాము ఇచ్చిన వీడియోలను కూడా సభలో ప్రదర్శించమంటే ఒప్పుకోలేదని అన్నారు. పెన్షన్లపై ప్రశ్నించడమే తన తప్పయిందని, దీనిపై మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా జగన్ నియంత్రణలో ఉంచుకోలేకపోతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

మరో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య మాట్లాడుతూ.. సభ నుంచి వాకౌట్‌ చేసే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మందబలంతో ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఏనాడూ మార్షల్స్‌ సభలోకి రాలేదని, కేవలం 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ప్రభుత్వం భయపడిపోతోందని ఎద్దేవా చేశారు. ‘ గెంటేయండి..తోసేయండి’ అంటూ సీఎం జగన్‌ ఆదేశాలిస్తున్నారని గోరంట్ల మండిపడ్డారు.