టీడీపీలో నెం. 2 లోకేష్ కాదు.. మరి ఆయనేనా?

 

టీడీపీలో ఎన్నో ఏళ్లుగా నెంబర్‌వన్ స్థానం ఆ పార్టీ అధినేత చంద్రబాబుదే. అయితే ఆ పార్టీలో నెంబర్‌. 2 స్థానం మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. ఒకప్పుడు మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్.. ఆ తరువాత నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా కొందరు నేతలు టీడీపీలో నెం. 2 స్థానం అని పేరు తెచ్చుకున్నారు. అధికారికంగా వీరిది పార్టీలో నెం.2 స్థానం కాకపోయినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం, పార్టీ వాయిస్ ని బలంగా వినిపించడం, పార్టీలో వీరి మాట ఎక్కువగా చెల్లుబాటు కావడంతో అంతా వీరే నెం. 2 అని చెప్పుకునేవాళ్లు. 

ఇక గత ఐదేళ్లలో టీడీపీలో నెం.2 స్థానమంటే చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి లోకేష్ అని పార్టీ శ్రేణులు చెప్పుకునేవి. అటు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వంలోనూ చంద్రబాబు తరువాతి స్థానం లోకేష్ దే. అయితే అధికారం దూరమయ్యాక.. ఇప్పుడు మళ్లీ టీడీపీలో నెం. 2 స్థానం మారిందని పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ ఉపనేతగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు టీడీపీలో నెం.2 స్థానంలోకి వచ్చారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

అసెంబ్లీలో చంద్రబాబు తరువాత, ఆ మాటకొస్తే చంద్రబాబు కంటే ఎక్కువగా వైసీపీ రాజకీయదాడిని తట్టుకుని టీడీపీ వాయిస్ ని బలంగా వినిపిస్తున్నది అచ్చెన్నాయుడే. దీంతో ప్రస్తుతం టీడీపీలో నెం.2 స్థానం అచ్చెన్నాయుడుదే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం.. అసెంబ్లీలో మాత్రమే అచ్చెన్నాయుడు నెం.2 అని.. పార్టీలో మాత్రం చంద్రబాబు తరువాత స్థానం లోకేష్ దే అని అంటున్నారు. మరి అనధికారికంగా ఈ ఐదేళ్లు పార్టీలో ఎవరు నెం.2 గా ఉంటారో చూడాలి.