అప్పుడు ఉత్తమ తహశీల్దార్...ఇప్పుడు ఉత్తమ లంచగొండి !

 

రెండేళ్ల క్రితం ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తహశీల్దార్ గా గుర్తించి అవార్డు ఇచ్చింది. ఇక తను ఉత్తమురాలిని అని అందరూ నమ్మేశారు అనుకుందో ఏమో కానీ తన చేతివాటం చూపడం మొదలు పెట్టింది. దీంతో ఇప్పుడు ఏసీబీ అధికారుల చేతికి చిక్కి జైలుకు వెళ్ళింది. ఈ వ్యవహారం పూర్వాపరాలు పరిశీలిస్తే ప్రస్తుతం కేశంపేట మండలంలోని కొందుర్గు వీఆర్వోగా పనిచేస్తున్న అనంతయ్య గతంలో దత్తాయిపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేశారు. 

దత్తాయిపల్లిలో ఉద్యోగం చేసిన సమయంలో అక్కడి రైతు మామిడిపల్లి చెన్నయ్య తన పంట పొలాన్ని ఆన్‌లైన్ రిజిస్టర్ చేయించాలనుకున్నాడు. మొత్తం 12 ఎకరాల పొలంలో 9.7 ఎకరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో చెన్నయ్య కుమారుడు భాస్కర్ అనంతయ్యను సంప్రదించాడు. అనంతయ్య ఎకరానికి రూ.30వేలు చొప్పున లంచం తీసుకుని గత నెల 18న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేశాడు. 

మళ్ళీ ఈ నెల 24న ఆన్‌లైన్‌ నుంచి ఆ రికార్డును తొలగించినట్టు కనిపించింది. దీంతో మళ్లీ అనంతయ్యను ఆశ్రయించగా ఈసారి ఎకరానికి లక్ష చొప్పున రూ.9లక్షలు లంచం ఇవ్వాలని లేకుంటే పని జరగదని చెప్పుకొచ్చాడు. అయితే భాస్కర్ రూ.8లక్షలకు డీల్ మాట్లాడి ఏసీబీ అధికారులను కలిసి వారికి విషయం చెప్పాడు. అనంతయ్య ఇంటికి భాస్కర్ కూడా వెళ్లి ఇంటి బయటే వేచివున్న అధికారులు అతను సరిగ్గా లంచం పుచ్చుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

దొరికిపోయిన అనంతయ్య తాను తీసుకుంటున్న లంచంలో రూ.5లక్షలు, తహశీల్దార్ లావణ్య వాటా కూడా ఉందని చెప్పాడు. దీంతో ఆమె ఇంట్లో కూడా ఏసీబీ తనిఖీలు చేయగా భారీ ఎత్తున నగలు,నగదు లభ్యమయ్యాయి. అనంతయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. లావణ్యపై కూడా అవినీతి కేసులు నమోదు చేశారు. మొత్తం రూ.93లక్షల నగదు, 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.