నరేంద్రను జైలుకెందుకు తరలించారు! ఏసీబీపై హైకోర్టు సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ అధికారుల అత్యుత్సాహానికి మరోసారి మొట్టికాయలు పడ్డాయి. ఏపీ ఏసీబీ అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగం డెయిరీ కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను జైలుకు తరలించడంపై సీరియస్ గా స్పందించింది. జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న నరేంద్రను కోర్టుకు తెలియకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలా తరలిస్తారని ఏసీబీ కోర్టు నిలదీసింది.

కోర్టు అనుమతిని ఎందుకు తీసుకోలేదని ఏబీసీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. నరేంద్రను వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచమని వైద్యులు తెలిపినప్పటికీ, జైలుకు ఎలా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ వచ్చిన వారు 14 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని తెలిపినప్పటికీ ఎలా తరలించారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. నరేంద్రను రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి లేదా విజయవాడ ఆయూష్ ఆస్పత్రికి తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. 

దూళిపాళ్ల నరేంద్రను నిబంధనలకు విరుద్ధంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేంద్ర తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ వాదించారు. అయితే నరేంద్రను ప్రతిసారీ విజయవాడకు తరలించాలంటే కష్టంగా ఉందని ఏసీబీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో ఖాళీ ఉంటే అక్కడే చేర్పించాలని, లేని పక్షంలో విజయవాడ ఆస్పత్రికి తీసుకురావాలని ఆదేశించింది. ఈసారి మాత్రం కోర్టు అనుమతి లేకుండా తీసుకెళ్లొద్దని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది.ఏసీబీ కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న దూళిపాళ్ల నరేంద్రను తిరిగి హాస్పిటల్ కు తరలించారు అధికారులు.