ఏసీబీకి చిక్కి ఉద్యోగ సంఘాల పరువుతీసిన ప్రబుద్ధుడు
Published on: Mon Jan 31, 2022 7:12PM
ప్రభుత్వ ఉద్యోగి అనగానే కాసింత బాధ్యత, ప్రజల విషయాల్లో కాసింత ప్రేమే ఉండాలి. కానీ వీడికేం పోయే కాలమో... సాటి మహిళా ఉద్యోగి వేతనంలోనే వాటా అడిగాడు. మూడు నెలల జీతంలోంచి సగం తనకిస్తేనే జీతం ఇస్తానంటూ మెలిక పెట్టడంతో ఆ మహిళా ఉద్యోగి కాస్తా ఏసీబీని ఆశ్రయించి వాడి శని వదిలించుకుంది. వివరాల్లోకి వెళ్తే..
విశాఖ జిల్లా గోలుగొండ మండలంలో గల వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం) గోవిందరావు తన దిగువ స్థాయి ఉద్యోగి దగ్గర రూ. 14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలోని బృందం కాపు కాసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలోని లింగంపేట క్లస్టర్ లో ఏకదేవి అనే మహిళా సీసీ పనిచేస్తోంది. తనకు మూడు నెలల జీతం రావడంతో.. అందులోంచి సగం జీతం కావాలంటూ ఏపీఎం గోవిందరావు డిమాండ్ చేశాడు. వాటా ఇవ్వకపోతే పేమెంట్ క్లియర్ చేయనంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. గోవిందరావు డిమాండ్ ను భరించలేకపోయిన ఏకదేవి ఏసీబీ అధికారులను సంప్రదించింది. దీంతో ఏసీబీ అధికారులు వెలుగు కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
కొత్త పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీనే కావాలని ఉద్యోగ సంఘాలన్నీ నిరసన తెలుపుతున్న ప్రస్తుత తరుణంలో గోవిందరావు చర్య ఉద్యోగ సంఘాల నేతల పరువుతీసేలా ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.


