రూల్ ప్రకారమే మాట్లాడా.. ఏబీవీ స్ట్రాంగ్ రిప్లై.. తగ్గేదేలే!
Published on: Wed Apr 6, 2022 11:47AM
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును సర్కారు టార్గెట్ చేసింది. ఇప్పటికే రెండేళ్లుగా సస్పెన్షన్ వేటులో ఉంచింది. అది భరించలేక, న్యాయం చేయాలంటూ ఇటీవలే ఏబీవీ మీడియా ముందుకు వచ్చారు. పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ మీదా మాట్లాడారు. అంతే. సర్కారుకు మళ్లీ కోపం వచ్చింది. రూల్ 6కు వ్యతిరేకంగా మీడియా సమావేశం ఎలా పెడతారంటూ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఏబీవీ సైతం తగ్గేదేలే అనేలా రూల్ 17 ప్రకారం తనకు ప్రెస్‌మీట్ పెట్టే హక్కు ఉందంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఏబీవీ వర్సెస్ ఏపీ ప్రభుత్వం... ఎపిసోడ్ మరింత ముదిరినట్టే కనిపిస్తోంది.
మీడియా సమావేశం నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. ‘‘వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించింది. రూల్ 17 నియమానికి అనుగుణంగానే మీడియాతో మాట్లాడాను. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెబుతున్నాయి. గౌరవానికి భంగం కలిగించేలా ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటాను? రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చాను’’ ఏబీవీ తెలిపారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.....
ఇటీవల ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకొచ్చి తమ హయాంలో పెగాసస్ కొనలేదు, వాడలేదంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ పరిణామం జగన్ సర్కారుకు ఊహించని షాక్. అప్పటి వరకూ చంద్రబాబు హయాంలో పెగాసస్ కొని, వాడారంటూ అబాంఢాలు వేసే పని చేసిన వైసీపీ సర్కారు ఏబీవీ ప్రెస్‌మీట్‌తో ఇరకాటంలో పడింది. అందుకే, రివేంజ్ యాక్షన్‌తో ముందుకొచ్చింది.
ఆనాటి మీడియా మీట్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టారు ఏబీవీ. తన రెండేళ్ల సస్పెన్షన్ కాలం ముగిసిందని.. తనకు పూర్తి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తానెలాంటి తప్పు చేయలేదని.. తనపై మోపిన ఛార్జిషీటు సైతం పస లేదని తేల్చి చెప్పారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం నినదించారు.
అంతే. ఏబీవీ చేసిన ఆ పని.. జగన్ సర్కారుకు రుచించినట్టులేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై వేటు వేసి రివేంజ్ చర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం.. రెండేళ్ల తర్వాత ఇప్పుడిలా ఏబీవీ తనకు జరిగిన అన్యాయంపై మీడియా ముందు నోరెత్తడంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడినట్టున్నారు. తమనే ప్రశ్నిస్తారా? అనేకున్నారో ఏమో.. వారి ఇగో బాగా హర్ట్ అయినట్టుంది. అటు, ఏబీవీ ప్రస్తావించిన అంశాలపైనా ప్రజల్లో చర్చ మొదలైంది. దీంతో.. సర్కారు మళ్లీ కౌంటర్ యాక్షన్‌కు దిగినట్టు.. ఐబీ మాజీ చీఫ్‌కు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసింది.
పెగాసస్‌తో పాటు సస్పెన్షన్ అంశాలపై మార్చి 21న ఏబీవీ మీడియాతో మాట్లాడారు. ఈవిషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ సమీర్‌శర్మ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ‘‘ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పే. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయి’’ అని షోకాజ్ నోటీసుల్లో ప్రభుత్వం హెచ్చరించింది. ఈ షోకాజ్ నోటీసులపై ఏబీవీ తను చేసింది నిబంధనల ప్రకారమే అంటూ వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.


