టీడీపీ హయాంలో పెగాసస్ కొనలే.. మాజీ ఐబీ చీఫ్ ఏబీవీ క్లారిటీ..
Published on: Mon Mar 21, 2022 4:58PM
టీడీపీ హయాంలో పెగాసస్ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పెగాసస్ కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో ఐబీ చీఫ్‌గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని, మే 2019 వరకు ఏ ఏపీ ప్రభుత్వ సంస్థ పెగాసస్ కొనలేదని తెలిపారు. మే 2019 తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదని తెలిపారు. పెగాసస్ వల్ల ప్రజల్లో అభద్రతా భావం కలుగుతోందని.. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
పెగాసస్ పట్ల తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఏబీవీ. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారన్నారు. తనపై అనేక ఆరోపణలు చేశారని, సీఎస్ ఆఫీస్‌కు మూడు వినతి ప్రతాలు ఇచ్చానని చెప్పారు. తనపై విచారణ త్వరగా ముగించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరానని తెలిపారు. తన సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు.
మరోవైపు ‘‘నన్ను సస్పెండ్ చేశారు.. దీనిపై కోర్టులో ఛాలెంజ్ చేశా.. నాపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం ఎంతవరకు కరెక్ట్? 30 ఏళ్లపాటు వృత్తి ధర్మం పాటించా.. దేశ ద్రోహిని ఎలా అవుతా.. పెగాసస్‌పై కూడా నాపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ’’ అని ఏబీవీ మండిపడ్డారు.


