మనం ఓడిపోయాం: ఐసిస్ చీఫ్
Published on: Thu Mar 2, 2017 10:31AM
.jpg)
తన మతోన్మాదంతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ఒక వీడియో ప్రసంగాన్ని విడుదల చేశారు. అందులో ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఓడిపోయిందని, అందువల్ల అరబేతర దేశాలకు చెందిన యోధులంతా తిరిగి తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోండి లేదా చచ్చిపోండి అంటూ చెప్పాడు. మోసుల్ నగరంపై ఇరాకీ సేనలు పట్టుబిగించడంతో ఐఎస్ డైలమాలో పడింది.
అందువల్ల అక్కడ ఇస్లామిక్ స్టేట్ కార్యాలయాన్ని మూసివేసి, అరబ్ దేశాల వాళ్లు కాకుండా సంస్థలో పనిచేస్తున్న ఇతర ఫైటర్లంతా తమ తమ సొంతదేశాలకు వెళ్లిపోవాలని లేదంటే తమను తాము పేల్చేసుకోవాలని బాగ్దాదీ ఆదేశించాడు. అలా మరణించినవారికి స్వర్గంలో 72 మంది మహిళలు దక్కుతారని చెప్పాడు. అమెరికా, రష్యా సేనల ప్రొత్సాహంతో ఇరాక్ సైన్యం ఐఎస్‌పై పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ రాజధానిగా చెప్పబడుతున్న మోసుల్ నగరాన్ని తిరిగి దక్కించుకునేందుకు భారీ ఎత్తున దాడులకు దిగింది. జనవరి నెలాఖరికి ఆ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో ఐఎస్ పతనం ప్రారంభమైంది. దీంతో ఇరాక్‌లో తాము ఓడిపోయినట్లు అబు బకర్ అంగీకరించాడు.


