TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆమ్ ఆద్మీ పార్టీలో ఘాటు శృం'కారం'!

Published on: Thu Sep 8, 2016 5:23PM

ఆప్ తన పేరులోని ఏ, ఏ అనే అక్షరాలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తోంది! అడల్ట్స్ ఓన్లీ పార్టీగా మారిపోతోంది. ఈ వ్యాఖ్యలు కొంచెం అతిగా అనిపించినా వెనువెంటనే జరుగుతోన్న పరిణామాలు అలా అనుకునేలా చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో తాజా కలకలం తెలిసిందేగా! సెక్స్ సీడీలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఆప్ ను రోడ్డుకీడుస్తున్నాయి. అవినీతి అంతం చేస్తామంటూ బరిలోకి వచ్చిన ఆప్ కి మరో గొప్ప ఇంధనం అప్పట్లో జరిగిన నిర్భయ ఉదంతం. ఢిల్లీలో స్త్రీలకు రక్షణ లేదంటూ అరవింద్ కేజ్రీవాల్ నానా యాగి చేశాడు. తాను సీఎం అయితే మహిళలకు ఫుల్ భరోసా అన్నాడు. సీసీ కెమెరాల వంటి బోలెడు హామీలతో హంగామా చేశాడు. కాని, ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీ పోలీస్ నా చేతిలో లేదని చెప్పటం మినహా ఒక్కసారి కూడా ఢిల్లీలో అత్యాచారాలకి బాధ్యత తీసుకోలేదు. 

ఢిల్లీలోని ఆడవాళ్లందర్నీ రక్షించటం మాట అటుంచి కనీసం తన పార్టీలోని స్త్రీలకి కూడా ప్రొటెక్షన్ లేకుండా పోయింది ఆప్ లో. మొన్నటికి మొన్న ఆ పార్టీ మంత్రి... సందీప్ సీడీల్లో సిగ్గులేకుండా దొరికిపోగా... ఆయన మీద వచ్చిన లాంటి ఆరోపణలే ఇంకా చాలా మంది మీద వస్తున్నాయి. అసలు ఆప్ కి ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు కొత్తేం కాదు. కొన్ని నెలల కింద పంజాబ్ కి చెందిన ఒక ఆమ్ ఆద్మీ కార్యకర్త తనని పార్టీలోని వారు లైంగికంగా వేధించారని ఆరోపించింది. అంతే కాదు, ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇక ఇప్పుడైతే మరీ దారుణంగా ఫిరోజ్ పూర్ మాజీ ఆప్ కన్వీనర్ అమన్ దీప్ కౌర్ 52మంది ఆడవాళ్ల లిస్టు తన వద్ద వుందని ప్రకటించింది. వాళ్లందర్ని అరవింద్ కేజ్రీవాల్ గ్యాంగ్ లోని మగ లీడర్లు లైంగికంగా వేధించారట. ఒకామె అయితే ఇప్పటికే ఆత్మహత్య చేసుకుందని కూడా అమన్ దీప్ కౌర్ చెప్పుకొచ్చింది. మిగిలిన 51మంది పేర్లు త్వరలో బయటపెడతానని హెచ్చరించింది!

తమ పార్టీ చీపురు పట్టి అవినీతిని ఊడ్చి పారేస్తుందని ప్రకటించుకున్న ఆప్ అలాంటి గొప్ప పనులేం చేయకపోవగా మరీ దారుణంగా సెక్స్ కుంభకోణాల్లో ఇరుక్కుంటోంది. ఇంత వరకు కాంగ్రెస్, బీజేపి, ఇతర పార్టీలు ఆర్దిక కుంభకోణాలే రుచి చూపించాయి. కాని, ఆప్ పాలిటిక్స్ కి సెక్స్ కోణం ఆవిష్కరిస్తోంది!  ఆప్ పైన ఆరోపణలు వచ్చినంత మాత్రాన అన్నీ నిజం కావాలని లేదు. కాని, మహిళలు వరుసగా బయటకొచ్చి తమపై లైంగిక దాడులు జరిగాయని చెప్పటం చిన్న విషయం కాదు. నిప్పు లేకుండా పొగ వచ్చేస్తోందని అనుకోవటం అమాయకత్వం అవుతుంది. అంతే కాదు, అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి గురువు అన్నా హజారే కూడా ఆప్ ను తప్పుబట్టాడు.

త్వరలోనే అరవింద్ పార్టీపై ఢిల్లీలో ఉద్యమం చేస్తానని ప్రకటించాడు. ఇది ఆమ్ ఆద్మీ ప్రతిష్టకి తీరని దెబ్బ. ఎందుకంటే, అరవింద్ కేజ్రీవాల్ కు చాలా మంది అన్నా హజారే మీద అభిమానంతో కూడా ఓట్లు వేశారు! ఈ సారి వాళ్లు కూడా దూరమయ్యే ప్రమాదం వుంది. మరీ ముఖ్యంగా, అతి త్వరలో రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు ఈ సెక్సు కేసుల పాపం ఖచ్చితంగా అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి... ఇంత దారుణంగా లైంగిక దాడుల ఆరోపణలు ఎదురైన ఆప్ బీజేపికి, అకాళీదల్ కు ఎంత పోటీ ఇస్తుందో!