తూచ్! ఆమాద్మీకి బేషరతు మద్దతు ఇస్తామని చెప్పలేదు : కాంగ్రెస్

 

అమాద్మీ పార్టీ కోరకుండానే ఆ పార్టీకి బేషరతుగా బయట నుండి మద్దతు ఇస్తామంటూ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ కు కొద్ది రోజుల క్రితమే లేఖ వ్రాసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు అమాద్మీపార్టీ కాంగ్రెస్ మద్దతు తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమని ప్రకటించగానే, కాంగ్రెస్ పార్టీ తామేమీ బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చింది.

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ అమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తామని ఎన్నడూ వాగ్దానం చేయలేదు. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అంశాల వారిగా ఆ ప్రభుత్వ పనితీరుని బట్టి మద్దతు ఇస్తాము తప్ప గుడ్డిగా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు,” అని కుండ బ్రద్దలు కొట్టారు.

 

ఇక మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అమాద్మీ చేసిన అనేక వాగ్దానాలలో చాలా వరకు ఆచరణ సాధ్యం కానివి. వాటిని అమలు చేయడం వీలుకాదని నా అభిప్రాయం. ప్రతీ విషయానికి ప్రజాభిప్రాయం కోరుతామని చెపితే ఇక ఆమాద్మీ ప్రభుత్వం పనిచేయగలదా? ఒక్కో ప్రాంతానికి విడివిడిగా బడ్జెట్ తయారు చేసి, ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకొని నిధులు కేటాయించడం సాధ్యమయ్యేపనేనా? ఏమయినప్పటికీ ప్రజాదరణతో అధికారం చేపడుతున్న అమాద్మీ పార్టీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక తన ఎన్నికల మ్యానినిఫెస్టోను అమలుచేయవలసిన బాధ్యత ఆపార్టీపైనే ఉంది,” అని షీలా దీక్షిత్ అన్నారు.