డిల్లీకి సుల్తాన్ ఆమాద్మీ

 

డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి సరిపడే మెజారిటీ లేకపోవడంతో వెనక్కి తగ్గిన ఆమాద్మీపార్టీకి కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో, కాంగ్రెస్ మద్దతు స్వీకరించడానికి సుముఖంగా లేని ఆమాద్మీ పార్టీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలా వద్దా అంటూ డిల్లీ ప్రజల అభిప్రాయం కోరింది. ఇంతవరకు దాదాపు పది లక్షల మంది స్పందించగా వారిలో 75శాతం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆమాద్మీ పార్టీ తరపున ప్రతాప్ గంజ్ నుండి ఎన్నికయిన మనిష్ సిసోడియా మీడియాకు తెలియజేసారు. ఈ ఆదివారం రాత్రి పార్టీ సభ్యులు సమావేశమయ్యి పార్టీ నిర్ణయాన్ని సోమవారం ఉదయం ప్రకటిస్తామని తెలిపారు. మెజారిటీ శాతం ప్రజలు ఆమాద్మీనే ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరుతున్నందున బహుశః సోమవారం ఆ పార్టీ తరపున ఎన్నికయిన శాసనసభ్యులు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దత తెలియజేయవచ్చును. ఆ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసే అవకాశం ఉంది.ఒకవేళ సోమవారం కూడా అమాద్మీ ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రాకపోయినట్లయితే డిల్లీలో రాష్ట్రపతి పాలన విదించే అవకాశం ఉంది.