విలువలకే అమాద్మీ ప్రాధాన్యం

 

అమాద్మీ కోరినట్లుగానే 16 అంశాలపై తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ అమాద్మీ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వెనుకంజ వేస్తుండటంతో, కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

 

ఈ నేపధ్యంలో ఆపార్టీ నేత అరవింద్ కేజ్రీ వాల్ మీడియాతో మాట్లాడుతూ, “వ్యక్తిగతంగా నాకు కాంగ్రెస్, బీజేపీల మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇష్టం లేదు. కానీ, ఇప్పుడు నా ఇష్టాఅయిష్టాల కంటే, ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తాము. అందుకే మేము డిల్లీలో 25లక్షల మంది ప్రజల నుండి అభిప్రాయం సేకరిస్తున్నాము. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరితే తప్పకుండా వారి ఆదేశాలను శిరసావహిస్తాము. వద్దంటే ప్రతిపక్షంలో కూర్చొంటాము."

 

"ఇంతవరకు ప్రజలు ఓట్లు వేయడం వరకే భాద్యత, ఆ తరువాత మొత్తం వ్యవహారమంతా నాలుగు గోడల మధ్య సూట్ కేసులతో కూర్చొనే రాజకీయ నాయకులదే అన్నట్లు సాగుతోంది. కానీ, మేము ఆ దుస్సంప్రదాయానికి పూర్తి భిన్నంగా, పూర్తి పారదర్శకతతో ప్రజల మధ్యనే ఈ వ్యవహారంపై తగు నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాము. అయితే దీనిని అలుసుగా తీసుకొని కొందరు నేతలు, వారి పార్టీలు మేము బాధ్యత తీసుకోవడానికి భయపడి పారిపోతున్నామని చాటింపు వేస్తున్నారు. అందుకు మేము భయపడేది లేదు."

 

"ప్రజలెన్నుకొన్న ప్రతినిధులు, వారి ద్వారా ఏర్పడే వ్యవస్థలు పూర్తిగా ప్రజలకే జవాబుదారీగా ఉండాలనే మా ఆలోచన, డబ్బు సూటు కేసులతో రాజకీయాలు చేసే వారికి చాలా విడ్డూరంగా, అర్ధం లేనిదిగా కనిపించవచ్చును. కానీ, నిజానికి ప్రజా ప్రతి నిధులు, వ్యవస్థలు ఈవిధంగానే జవాబుదారీతనంతో పనిచేయాలని ప్రజలు భావిస్తారు. అందుకే మేము ప్రజలకే మేము కట్టుబడి ఉంటాము తప్ప ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలకు, విమర్శలకు కాదు."

 

"చాలా మంది ప్రజలు, మా పార్టీలో కూడా అనేకమంది కాంగ్రెస్ బేషరతు మద్దతు ఇస్తోంది గనుక దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఈ నాలుగు నెలల సమయంలో మా సమర్ధత నిరూపించుకొనగలిగితే రానున్నసార్వత్రిక ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించవచ్చని సూచిస్తున్నారు. వారు చెపుతున్నది నిజమే అయినప్పటికీ, మొన్న జరిగిన ఎన్నికలలో మా పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా ప్రచారం చేసి, వారి భ్రష్ట రాజకీయాల నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ వారితోనే చేతులు కలపితే, మాపార్టీ కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లవుతుంది. అందుకే ప్రస్తుత పరిస్థితి వారికి వివరించి, మేము ఏవిధంగా వ్యవహరించాలని వారి అభిప్రాయం కోరుతున్నాము."

 

"ప్రజలను యస్.యం.యస్., ఈ-మెయిల్ మరియు ఇతర మార్గాల ద్వారా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని కోరాము. వారి స్పందన, సలహాల మేరకు మేము త్వరలోనే సముచిత నిర్ణయం తీసుకొంటాము,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.