డిశంబర్ 28న ఆమాద్మీ ప్రమాణ స్వీకారం

 

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆమాద్మీ పార్టీకి అనుమతి ఈయడంతో, ఈ నెల 28న(శనివారం) డిల్లీ ప్రభుత్వపగ్గాలు చెప్పట్టేందుకు అమాద్మీ సిద్ధం అవుతోంది. డిల్లీలో సుప్రసిద్ధ రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు ప్రజల సమక్షంలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆయన ఆరుగురు అనుచరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

అమాద్మీకి మొదట బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తాము అంశాల వారిగానే మద్దతు ఇస్తామని, అమాద్మీ ప్రభుత్వం తమ నేతలకు వ్యతిరేఖంగా చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని చెపుతోంది. ఇప్పుడు దానికి మరో వాక్యం అదనంగా జోడిస్తూ అమాద్మీకి తాము మూడు నెలల గడువు ఇస్తున్నామని, దాని పని తీరును బట్టి మద్దతు కొనసాగించే విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. అంటే ముందే ఊహించినట్లుగా రాబోయే ఎన్నికల ముందు మద్దతు ఉపసంహరించి అమాద్మీ ప్రభుత్వాన్ని పడగొట్టబోతోందని స్పష్టం అవుతోంది.

 

అందుకు అమాద్మీ కూడా మానసికంగా సిద్ధమయ్యే ఉంది గనుక అమూల్యమయిన ఈ మూడు నెలల సమయంలో “నిజంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని’ ఏర్పాటుచేసి తనను తాను నిరూపించుకోగలిగితే, ఈసారి పూర్తి మెజార్టీతో ఎన్నికయి ఎవరి మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది.