ఆమ్ ఆద్మీ మీద కాంగ్రెస్ కత్తి!

 

 

 

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నెలరోజుల్లోనే కేజ్రీవాల్ ఏ స్థాయి పరిపాలనా దక్షుడో ఢిల్లీ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఆయన పార్టీ అభ్యర్థులను అనవసరంగా ఎమ్మెల్యేలుగా గెలిపించామన్న పశ్చాత్తాపంతో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కుమిలిపోతున్నారు. దేవుడి దయవల్ల ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే అటు కాంగ్రెస్‌ని, ఇటు కేజ్రీవాల్‌ని జాయింట్‌గా ఇంటికి పంపించేసి బీజేపీకి పట్టం కట్టాలని భావిస్తున్నారు.

 

కేజ్రీవాల్ చెప్పేదొకటి చేసేదొకటి అనే విషయం ఈ నెలరోజుల్లో అనేక సందర్భాలలో రుజువైంది. దీనికితోడు ఆమ్ ఆద్మీ పార్టీలో అధికారం కోసం కుమ్ములాటలు, ఒక ఎమ్మెల్యే తిరుగుబాటు చేయడం, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించడం ఢిల్లీ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీని చులకన చేసేశాయి. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఓ మంత్రిగారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా, సినిమా ఫక్కీలో దాడులు, సోదాలు చేస్తూ వుండటం ప్రజలకు మింగుడు పడటం లేదు. నిర్భయ సంఘటనను ఆధారంతా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులకే ఢిల్లీలో ఓ విదేశీ వనిత మీద అత్యాచారం జరిగింది. ఈ సంఘటన విషయంలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యత తీసుకోకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోంది.


అందుకే తాము చేసిన పొరపాటును దిద్దుకోవడం కోసం ఢిల్లీ ఓటర్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్టుగా ఢిల్లీ ప్రజలు కోరుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ ఎన్నికలలో నిలబడింది. సదరు పార్టీ పునాదుల్లోనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వుంది. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత అదే పార్టీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తనని ఎంతగా తిట్టినా వాటినన్నిటినీ మర్చిపోయినట్టు నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఒకపక్క ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతూనే మరోపక్క కాంగ్రెస్ పార్టీని నాన్‌స్టాప్‌గా తిడుతూనే వుంది. దీంతో మంచి ముహూర్తం చూసి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఉపసంహరించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసి, మళ్ళీ ఎన్నికలు వచ్చేలా చేస్తే తాను మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం వుందని కాంగ్రెస్ కలలు కంటోంది.