కిడ్నీ రాకెట్ కేసు.. ఏ2 డాక్టర్ పార్థసారథి లొంగుబాటు
Published on: Fri Dec 5, 2025 9:24AM
.webp)
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న డాక్టర్ పార్థసారథి రెడ్డి గురువారం మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తలిసిందే. కాగా లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి రెడ్డికి న్యామూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.
కిడ్నీ విక్రయం కోసం గత నెల 9న విశాఖకు చెందిన యమున అనే యువతికి ఆపరేషన్ చేస్తుండగా ఆమె మరణించడంతో ఈ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు రూ.8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ క్రమంలో యమునకు శస్త్రచికిత్స చేస్తుండగా ఆమె మరణించారు.
వెంటనే ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో రహస్య ప్రాంతానికి తరలించారు. యమున భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 డాక్టర్ ఆంజనేయులు, మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మదనపల్లె ఎస్బిఐ కాలనీ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో ఏ 2 నిందితుడు, బెంగుళూరు కి చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లైంది.


