కడపలో 9 మంది మరణం ఎందుకో తెలుసా...
Published on: Sat May 8, 2021 12:22PM
కడప జిల్లాలో కలకలం చెలరేగింది. భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు అక్కడికక్కడే చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జిలెటిన్‌స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిసింది. ప్రమాదవశాత్తు వాహనంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. బద్వేలు నుంచి ముగ్గురాళ్లగనికి జిలెటిన్‌స్టిక్స్ తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. మృతుల పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కడప పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.


