గంటల వ్యవధిలోనే 9 మంది శిశువులు మృతి
Published on: Fri Dec 11, 2020 2:06PM
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే 9 మంది శిశువులు మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఏడాది క్రితం ఇలాంటి ఘటన చోటు చేసుకోగా.. తాజాగా ఇదే రీతిన శిశువులు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది.
బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు శిశువులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 రోజుల వయస్సులోపు వారే అని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. కాగా, కోటా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆరోగ్య మంత్రికి పంపిన నివేదిక ప్రకారం, పుట్టుకతోనే వైఫల్యాలు రావడంతో ముగ్గురు శిశువులను జేకే లోన్ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా మరణించారు. మిగతా శిశువులవి ఆకస్మిక మరణాలు అని నివేదికలో తెలిపారు.


