భర్త హత్య కేసులో 35 ఏళ్ల తరువాత అరెస్ట్ అయిన బామ్మ

 

 

1984 మే 14, అంటే దాదాపు 35ఏళ్ల క్రితం నోర్మా ఆల్బ్రిటన్ టెక్సాస్ లోని తన ఇంటికి వచ్చే సరికి భర్త జానీ ఆల్బ్రిటన్ రక్తపు మడుగులో ఉన్నాడట. ఎవరో దుండగులు తన భర్తను కాల్చి కిటీకీలోంచి పారిపోయారని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే జానీ ఆల్బ్రిటన్ భార్య పై పోలీసులకు అనుమానం కలగటంతో ఆమెకు లై డిటేక్టర్ పరీక్ష చేసినా ఆమె ఆ హత్య చేసినట్టు నిర్ధారణ కాలేదు. ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆ కేసు 35 ఏళ్లుగా పెండింగులో ఉంది. అయితే ఈ కేసును 2015లో లియోన్ కౌంటీ పోలీస్ అధికారి కెవిన్ ఎల్లిస్ డిజిటైజ్ చేసి కోల్డ్ జస్టిస్ అనే టీవీ షోకు ఇచ్చాడు. ఆ షో నిర్వాహకులు ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకొని పోలీసులు ఇచ్చిన ఆధారాలతో జానీ ఆల్బ్రిటన్ ఇంటి చుట్టుపక్కల 50 మంది అనుమానితులను ఇంటర్వ్యూ చేశారు. వారి విచారణలో భార్య నోర్మానే భర్తను హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ కేసు పూర్తి వివరాలను షో నిర్వాహకులు పోలీసులకు సమర్పించడంతో మొన్న జూలై 1న ఈ 85 ఏళ్ల నోర్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వృద్ధాప్యం కారణంగా అధిక మొత్తం పూచికత్తు తో ఆమెను విడుదల చేసి కోర్టు ద్వారా విచారణ కొనసాగిస్తున్నారు. అందుకే అంటారు మన పెద్దలు తప్పు చేసిన వారు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదని.