ఉండేది పూరి గుడిసె.. అకౌంట్లో 75 కోట్లు.. మిస్టరీ మనీ కలకలం..
Published on: Thu Jan 13, 2022 10:37AM
ఒక నిరుపేద కోటీశ్వరుడు కావలంటే, ఏమి చేయాలి, ఏదైనా లాటరీ తగలాలి .. లంకె బిందెలు, గుప్త నిధులు బయట పడాలి... కాదంటే కౌన్ బనేగా ... లో ఫై మెట్టుకు చేరాలి. అయితే, అవేవీ లేకుండానే, ఝార్ఖండ్లో ఓ నిరుపేద వృద్ధుడు కోటీశ్వరుడయ్యాడు. కాదు, బ్యాంకు బాబులు ఆయన్ని,’తాత్కాలికంగా కోటీశ్వరుని చేశారు.
వివరాలోకి వెళితే, ఝార్ఖండ్ దుమ్కా జిల్లాలో ఓ నిరుపేద వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరు డయ్యారు. ఆయనకే తెలియకుండా ఆయన పెన్షన్ అకౌంట్లో సుమారు 75 కోట్ల రూపాయలు జమ అయ్యాయి.
ఆ నిరు పేద పేరు ఫూలో రాయ్. ఆయన జిల్లాలోని జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో తన కుమారుడు, భార్యతో కలిసి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వ్యవసాయ కూలీగా జీవితం సాగిస్తున్నఆయనకు రాయ్కినారిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి సమీపంలోని రూరల్ సర్వీస్ సెంటర్కు వెళ్లాడు. 10,వేల రూపాయలు విత్డ్రా చేసుకున్నాడు. కానీ అకౌంట్లో మిగిలిన డబ్బులు చూసి అవాక్కయ్యాడు. అకౌంట్లో రూ.75.28 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకూ తెలియదని చెప్పాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు.దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు.. ఫూలో రాయ్ అకౌంట్ పని చేయడమే లేదని, అయినా ఆయన ఎకౌంటు సొమ్ములు ఎలా చేరాయో అని ఆశ్చర్యం వ్యక్త పరిచారు. ఇంత మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియలేదని వెల్లడించారు. దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
అయితే ఇలా, పేదల ఖాతాల్లో పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులు జమ కావడం, ఆ తర్వతా బ్యాంకు అధికారులు ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో అప్పుడప్పుడు రిపోర్ట్ అవుతూనే వుంది. గతంలోనూ అలాంటి వార్తలు వచ్చాయి. ఈ విధంగా పెద్దల ఖాతాల్లో డబ్బులు పడి వెనక్కి పోవడం వెనక ఏదో మతలబు ఉందని, అంటారు. అయితే ఎప్పటికప్పుడు బ్యాకు అధికారులు విచారణ జరిపుతున్నాం ..అంటారే గానీ, విచారణలో ఏమి తేలింది .. అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలింది. దాల్ మే కుచ్చి కాలా హై .. కావచ్చును .


