జోన్లు తేలకుండా, టెట్ లేకుండా భర్తీ ఎలా? ఓట్ల కోసం కేసీఆర్ మరో మోసమా? 

తెలంగాణలో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల నియమాకాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎక్కడైన ఉద్యోగ ప్రకటన వస్తే నిరుద్యోగులు సంతోషపడతారు. ఖాళీలు భర్తీ చేస్తామన్న సర్కార్ కు కృతజ్ఞతలు చెబుతారు. కాని తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ముఖ్యమంత్రే స్వయంగా ఉద్యోగ ప్రకటన చేసినా నిరుద్యోగులు మండిపడుతున్నారు. విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం ప్రకటనను జనాలు కూడా నమ్మడం లేదు. తమను సీఎం మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యకం చేస్తున్నారు ఉద్యోగాల కోసం ప్రీపేరవుతున్న అభ్యర్థులు. ఓట్ల కోసం మరోసారి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

 

ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ చెప్పినా నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఉద్యోగ ఖాళీల భర్తీపై ముఖ్యమంత్రే ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా జోనల్ కేడర్ తేల్చకుండా పోస్టులను ఎలా నియమిస్తారన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది. రాష్ట్రంలో జోన్ల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోన్లను పునర్ వ్యవస్థికరిస్తూ కేసీఆర్ సర్కార్ తీసుకున్న విధాన పరమైన నిర్ణయం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో రాష్ట్రంలో మల్జీ జోనలో పోస్టులేంటీ, జోనల్ పోస్టులేంటీ, డిస్ట్రిక్ లెవల్ కేడర్ ఏంటో తేలలేదు. ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఉండాల్సిన పోస్టుల సంగతి తేలలేదు. జోనల్ సిస్టమ్ లో క్లారిటీ లేకనే.. కేసీఆర్ సర్కార్ ఇంతవరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గ్రూప్ 2 ఇచ్చి కొన్ని పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టినా.. వారికి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జోనల్ , మల్జీ జోనల్ కేడర్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగం వచ్చి  ఏండ్లు గడుస్తున్నా కొలువులో చేరలేకపోతున్నారు గ్రూప్ 2 విజేతలు.  

 

జోన్ల ఇష్యూ పరిష్కరించకుండా జేఎల్,డీఎల్ వాంటి ఉద్యోగాల భర్తీ అసాధ్యం. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై విద్యా వేత్తలు, నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. జోన్లపై సర్కార్ క్లారిటీ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిడం మోసపూరితమేనని వారంతా ఆరోపిస్తున్నారు. ఇవేవి తేల్చకుండా సర్కార్ ముందుకు పోయినా.. ఎవరో ఒకరు కోర్టుకు వెళితే నియామక ప్రక్రియ ఆగిపోవడం ఖాయమంటున్నారు.  తెలంగాణ వచ్చాకా కేసీఆర్ సర్కార్ నిర్వహించిన పరీక్షల్లో చాలా వరకు కోర్టు కేసులతోనే నిలిచిపోయిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్నిప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిరుద్యోగ అభ్యర్థులు ఫైరవుతున్నారు. పోలీసు నియామకాల్లోనూ జోనల్ సిస్టమ్ పెద్ద సమస్యగా మారింది. డీఎస్పీ, సీఐ పోస్టులపై స్పష్టత రాక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు, ఈ సమస్య వల్లే పోలీస్ శాఖలో చాలా కాలంగా ప్రమోషన్లు నిలిచిపోయాయని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో అర్హులుగా ఎంపికై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఇంకా పోస్టింగులు ఇవ్వడం లేదు. 

 

ఇక కేసీఆర్ ప్రకటించిన ఉపాద్యాయ పోస్టుల నియామకంలో పెద్ద గందరగోళమే ఉంది.  టీచర్ పోస్టుకు కనీస అర్హత అయిన టెట్  ఎగ్జామ్ నిర్వహించకుండా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ఎట్లా అన్న చర్చ వస్తోంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేండ్లలో కేవలం రెండుసార్లే .. 2016 మే 22న, 2017 జులై 23న టెట్ నిర్వహించారు. ఒకసారి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేండ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ టెట్‌ పరీక్ష రాయాలి. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాలి. కాని తెలంగాణ విద్యాశాఖ మాత్రం తాము ఏడాదికి ఒక్కసారే నిర్వహించేలా 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమైనా 2018, 2019, 2020లో మూడు సార్లు నిర్వహించాల్సి ఉన్నా పరీక్ష జరపలేదు.  ఇప్పటికే గడువు తీరిన ఐదు లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెట్ నిర్వహించని కారణంగా 2018, 2019, 2020లో బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ రాయలేదు. మొత్తంగా ఆరేడు లక్షల మంది బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు.. సర్కార్ ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల టెట్ కు దూరమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం టీఆర్టీ నిర్వహిస్తే..  వీరంతా ఆ పరీక్ష రాసే అవకాశం కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే టీచర్ల పోస్టుల నియామకం జరగడమన్నది జరిగే పని కాదంటున్నారు విద్యా రంగ నిపుణులు, నిరుద్యోగ అభ్యర్థులు. 

 

తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఎస్సీని ప్రభుత్వం టీచర్ రిక్రూట్ మెంట్ గా మార్చేసింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒక్కసారే టీచర్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్‌ 21న టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇవ్వగా కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో నియామక ప్రక్రియలో  జాప్యం జరిగింది. అనేక ఆందోళనల అనంతరం పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. గత ఆరేండ్ల లో వేలాది మంది టీచర్లు రిటైర్డ్ అయినప్పటికీ మళ్లీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి టెట్‌ స్కోర్‌ కాలపరిమితిని ఏడేళ్లకు బదులు జీవితకాలం ఉండేలా ఇటీవలే నిర్ణయించింది. అయితే ఇక నుంచి టెట్‌ రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకే ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ఉత్తీర్ణులైన వారికి న్యాయనిపుణుల సలహా తీసుకొని దాన్ని పాటిస్తామని ఎన్‌సీటీ ప్రకటించింది. కాని దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు. అది వస్తే గాని తెలంగాణలో డీఎస్సీ నిర్వహించడం కుదరదు. టీఆర్టీ పెట్టే ఉద్దేశం లేకనే ప్రభుత్వం అంతకాలం టెట్ ను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ లేకుండానే  సర్కార్ టీఆర్టీ నోటిఫికేషన్ వేస్తే..  ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం ఖాయం. అదే జరిగితే టీచర్ పోస్టుల నియామక ప్రక్రియ ఆగిపోతుందని నిరుద్యోగులు చెబుతున్నారు. 

 

ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఇన్ని జటిలమైన అంశాలు ఉన్నా కేసీఆర్ మాత్రం.. త్వరలోనే నోటిఫికేషన్లంటూ మోసం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల ఓట్ల కోసమే తాజా ప్రకటన వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. నిరుద్యోగులు, యువత టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారంతా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండనున్నారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్  ఉద్యోగ ప్రకటనల పేరుతో నిరుద్యోగులను, జనాలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలే ఎక్కువగా వస్తున్నాయి. ఓట్ల కోసం కుట్రలు చేస్తూ నిరుద్యోగులతో ఆటలాడవద్దని సీఎం కేసీఆర్ కు కొందరు హెచ్చరిస్తున్నారు.