నైజీరియాలో చర్చిపై ఉగ్రదాడి..50 మంది మృతి
Published on: Mon Jun 6, 2022 10:40AM
ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఓ చర్చిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 50 మంది ఉసురు తీశారు. పలువురిని తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన నూజీరియాలోని సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో జరిగింది. ఆదివారం కావడంతో ప్రార్థనల కోసం భారీ సంఖ్యలో భక్తులు హాజరైన సమయం చూసి ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్నఆందోళన వ్యక్త మౌతోంది.
మృతులలో ఎక్కువ మంది చిన్నారులు కావడం కలచివేస్తున్నది. ఈ ఘటన అనంతరం చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యలు ప్రపంచ వ్యాప్తంగా నేతలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుఖారీ ఈ ఘటన పట్లదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మానవ రూపంలో ఉన్న రాక్షసులు మాత్రమే ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడతారని అన్నారు. ఇటువంటి హింసాకాండతో దేశాన్ని లొంగదీసుకోవాలన్న ప్రయత్నాలు ఫలించవనీ, ఉగ్రవాదంపై పోరులో విజయం సాధిస్తామనీ అన్నారు.
మృతుల కుటుంబాలకు దేశం యావత్తూ సంఘీభావం ప్రకటిస్తోందని అన్నారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్ర సంస్థ ఏదన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్ర సంస్థా దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.


