49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర! గతంలో కంటే బెటర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో 49 మంది నేర చరిత్ర గల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తీసుకుని విశ్లేషించిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. నేరచరిత కలిగిన అభ్యర్థులు పార్టీల వారిగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 13 మంది, బీజేపీ తరపున 17 మంది, కాంగ్రెస్‌ నుంచి 12, మజ్లిస్‌ నుంచి ఏడుగురు ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆరుగురి మహిళా అభ్యర్థులపైనా కేసులున్నాయని ఎఫ్‌జీజీ తెలిపింది. గ్రేటర్‌లో నేరచరిత్ర కలిగిన వారు పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య 41 కాగా .. మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉందని ఎఫ్‌జీజీ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు. 

 

కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రీతం కుమార్‌ రెడ్డిపై అత్యధికంగా 9 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత షాలిబండ 48 వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్‌ ముస్తఫా అలీపైన 7 కేసులు ఉన్నాయి. మారెడ్‌పల్లి వార్డు బీజేపీ అభ్యర్థి టి. శ్రీనివాస్‌ రెడ్డిపై 5 కేసులు, మోండా మార్కెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన ఆకుల రూపపైన 5 కేసులు ఉన్నాయని ఎఫ్‌జీజీ వెల్లడించింది. మిగతా వారిలో కొందరిపై నాలుగు, మరికొందరిపై మూడు, రెండు కేసులు ఉండగా చాలా మంది అభ్యర్ధులు కేవలం ఒకే కేసులో నిందితులుగా ఉన్నారు.

 

గత గ్రేటర్‌ ఎన్నికల్లో 72 మంది నేరచరితులకు వివిధ పార్టీలు టికెట్లు ఇవ్వగా ఈ సారి 49 మందే ఉన్నారు. పోటీ చేస్తున్న వారిలో నేర చరిత్ర ఉన్న వారు తగ్గడం శుభపరిణామని పద్మనాభరెడ్డి చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నేరమయ రాజకీయాలు తగ్గిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసి తమకు అవసరమైన వారిని ఎన్నుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు.