TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెన్‌డౌన్‌లో ఆ 480 ఎక‌రాలను ఏంచేశారు? అమ‌రావ‌తిలో భం భం భూమ్‌!

Published on: Mon Feb 7, 2022 10:44AM

ప్రభుత్వ ఉద్యోగులు జ‌గ‌న్ స‌ర్కారుపై పోరాడుతున్నారు. ఛ‌లో విజ‌య‌వాడ‌తో చ‌మ‌ట‌లు ప‌ట్టించారు. పీఆర్సీ జీవోల ర‌ద్దు కోసం పెన్‌డౌన్‌, సిస్ట‌మ్స్ ష‌ట్‌డౌన్ చేశారు. అంతా ఉద్య‌మంలో బిజీగా ఉన్నారు. ప్ర‌జ‌ల అటెన్ష‌న్ అంతా స‌మ్మెపైనే ఉంది. ఇదే మంచి ఛాన్స్‌గా.. సంద‌ట్లో స‌డేమియాలా.. స‌ర్కారు సీక్రెట్‌గా ఓ కీల‌క డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అమ‌రావ‌తి ప‌రిధిలో సుమారు 480 ఎక‌రాల భూమిని సీఆర్‌డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినట్టు సమాచారం. ఉద్యోగులు పెన్‌డౌన్ చేసిన  శనివారం రోజే.. మందడంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ తనఖా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసినట్టు తెలిసింది. ఇంత‌కీ, ప్ర‌భుత్వం అంత గ‌ప్‌చుప్‌గా ఈ తతంగం ఎందుకు పూర్తి చేసిన‌ట్టు? త‌న‌ఖా వెనుక తిర‌కాసు ఏమైనా ఉందా?

శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెన్‌డౌన్‌ చేసినప్పటికీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించినట్టు సమాచారం. అనంతవరం, మందడం, ఉద్ధండరాయునిపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో రైతులు భూసమీకరణలో ఇచ్చిన భూమిలో సీఆర్‌డీఏ వాటాకు వచ్చిన దాంట్లో కొంత బ్యాంకులకు తనఖా పెట్టినట్టు తెలిసింది. రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఈ భూమిని బ్యాంకులకు తనఖా పెట్టినట్టు చెబుతున్నారు. అయితే ఏ బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్నారు? ఏ అవసరానికి తీసుకుంటున్నారు? అన్న విషయంలో స్పష్టత లేదు. అంతా స‌రైనదే అయితే, ఇంత ర‌హ‌స్యంగా ఈ య‌వ్వారాన్ని జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఏముంద‌నేదే ప్రశ్న‌.

ఇప్పుడు సీఆర్‌డీఏ తీసుకుంటోంది పూర్తిగా కొత్త రుణమా? లేదా గతంలో హడ్కో రుణం కోసం తనఖా పెట్టిన భూమిని ఇప్పుడు ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కోసం కేటాయించినందున దాన్ని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా మరో భూమిని తనఖా పెట్టిందా? అనేది తేలాల్సి ఉంది. 

రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల నుంచి రాజధానిలో ప్రస్తుతం స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువ, బహిరంగ మార్కెట్‌ విలువల వివరాలను తెప్పించుకున్నట్టు తెలిసింది. బ్యాంకులకు తనఖా పెట్టిన భూముల్లో సర్వేచేసి మార్కింగ్‌ కూడా చేశారని సమాచారం.   

రాజధానిలో ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కుదించి తొలిదశలో రూ.3 వేల కోట్లతో పనులు చేపడతామని ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. దానికి సంబంధించి సీఆర్‌డీఏ ఒక డీపీఆర్‌ సిద్ధం చేయించి గత నెల 9న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంటామని తెలిపింది. రుణం తీసుకున్న మూడో సంవత్సరంనుంచి రాజధానిలోని 481 ఎకరాలను దశలవారీగా 15 ఏళ్లపాటు విక్రయించి తీసుకున్న రుణాన్ని తీర్చేస్తామని డీపీఆర్‌లో తెలిపింది. మూడో ఏడాదిలో రాజధానిలో భూమి విలువ ఎకరం రూ.7 కోట్లు ఉంటుందని, 17వ ఏడాదిక‌ల్లా ఎకరం విలువ సుమారు రూ.17.74 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. బ్యాంకుల నుంచి ఆ రూ.3వేల కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకు గ్యారంటీనిస్తూ ప్రభుత్వం గ‌తంలోనే జీవో ఇచ్చింది. ఇప్పుడు ఈ రూ.3 వేల కోట్ల రుణానికే సీఆర్‌డీఏ భూమి తనఖా పెట్టిందా? అనేది తేలాల్సి ఉంది. 

రాజధాని నిర్మాణానికి గతంలో సీఆర్‌డీఏకు హడ్కో రూ.1,250 కోట్ల రుణమిచ్చింది. దాని కోసం అప్పట్లో మంగళగిరి సమీపంలోని నవులూరులో గతంలో వీఎంఆర్‌డీఏ ఉన్నప్పుడు లేఅవుట్లు వేసేందుకు సేకరించిన భూమిని సీఆర్‌డీఏ తనఖా పెట్టింది. ఇప్పుడు అదే భూమిలో మధ్యతరగతివర్గాల కోసం ఎంఐజీ లేఅవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఆ భూమిని తనఖా నుంచి విడిపించాలంటే దానిపై హడ్కో రుణమైనా చెల్లించాలి? లేదా ప్రత్నామ్నాయ భూమినైనా చూపించాలి? ఇప్పుడు రాజధాని గ్రామాల్లోని భూమిని హడ్కోకే సీఆర్‌డీఏ రిజిస్ట్రేషన్‌ చేసిందన్న అభిప్రాయమూ ఉంది. ఏ అవసరం కోసం రాజధాని గ్రామాల్లోని భూమిని తనఖా పెట్టారన్న అంశంలో అధికారుల నుంచి స్పష్టత రాలేదు.

అయితే, రుణం కోసం 480 ఎకరాల అమరావతి భూములును తనఖా పెట్టడం దారుణమని బీజేపీ నేత లంకా దినకర్ విమ‌ర్శించారు. ఉద్యోగులు పెన్ డౌన్ సమయంలో రాజధాని భూముల తనఖా రిజిస్ట్రేషన్ కోసం పెన్ ఎలా కదిలిందని నిలదీశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రుణాల నిధులు పక్కకు మల్లించే అధికారం ఎవరికీ లేదన్నారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఎకరా ధర రూ.7 కోట్లు అని ప్రభుత్వం చూపుతున్నప్పుడు, ఆ లెక్క ప్రకారం పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్ర‌శ్నించారు. 

సీఆర్డీఏ పరిధిలో రైతులు రాజధాని కోసం ఇచ్చిన భూముల సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మాత్రమే రుణాలు తీసుకొని అభివృద్ధి చేయాలన్నారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి కోసం కాకుండా అమరావతి భూముల అమ్మకం, రుణాలు సేకరించడం నేరమన్నారు. దీనిపై కోర్టుకి వెళాత‌మ‌న్నారు బీజేపీ నేత‌ లంకా దినకర్.