45 BMW లగ్జరీ కార్లు దగ్ధం.. కోట్లలో నష్టం..
Published on: Wed Dec 8, 2021 1:27PM
ఒక్క BMW కారైనా కొనడమే చాలా మందికి స్వప్నం. ఖరీదైన లగ్జరీ కార్లలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ ఒకటి. మినిమం 70 లక్షల నుంచి ధర ప్రారంభం. 3 కోట్ల కారు కూడా ఉంది. అంతటి ఖరీదైన BMW కార్లు ఒక్కసారిగా కాలిబూడిదయ్యాయి. ఒకటి రెండూ కాదు.. ఏకంగా 45 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఆ మంటలు ఆర్పడానికి 10 ఫైర్ ఇంజన్లు.. 6 గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందంటే ఎంత పెద్ద ప్రమాదమో ఊహించవచ్చు.
మహారాష్ట్ర నవీ ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీఎండబ్ల్యూకు చెందిన షోరూం కమ్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఘటనలో 45 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో షోరూంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే కార్లన్నీ తగలబడ్డాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
10 అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 6 గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అప్పటికీ భారీ నష్టం జరిగింది. కోట్లాది రూపాయల విలువైన కార్లన్నీ కాలి బూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఒక్కటే గుడ్‌న్యూస్. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.


