TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

44 ఏళ్ల ప్ర‌జా జీవితం.. రాజ‌కీయ దురంధ‌రుడు.. అలుపెర‌గ‌ని యోధుడు..

Published on: Sat Feb 26, 2022 11:22AM

'మ‌ఖ'లో పుట్టి 'పుబ్బ‌'లో పోయే నేత‌లు చాలామందే ఉంటారు. చ‌రిత్ర‌లో చెర‌గ‌ని ముద్ర వేసి.. చిర‌స్థాయిగా నిలిచే యోధులు కొంద‌రే. అలాంటి రాజ‌కీయ దురంధ‌రుడే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు. 44 ఏళ్ల క్రితం ఫిబ్ర‌వ‌రి 25న తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు.. తన ప్రత్యర్ధి కొంగర పట్టాభిరామ చౌదరిపై గెలుపొందారు. తాజాగా, ప్రజాప్రతినిధిగా 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆ ప్ర‌యాణం, పోరాటం, ప్ర‌జా జీవితం మ‌రింత సుదీర్ఘంగా కొన‌సాగ‌నుంది. 

44 ఏళ్ల ప్ర‌జా ప్రస్థానం త‌ర్వాత కూడా.. త‌న‌లో ఉత్సాహం ఏమాత్రం త‌గ్గ‌లేదంటున్నారు చంద్ర‌బాబు. పని చేయాలి.. సాధించాలనే తపన ఇప్పటికీ అలానే ఉంద‌న్నారు. "నాడు ఎస్వీ యూనివ‌ర్సిటీ విద్యార్థులుగా గ్రామాలకు వెళితే ఎంతో ఆదరణ ఉండేది. నేను యూనివర్సిటీ లీడర్‌గా ఎదిగి తర్వాత అసెంబ్లీకి పోటీ చేశా. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నాకు మంత్రి పదవి కావాలని అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అడిగితే.. ఏంటి ఇంత దూకుడుగా ఉన్నావ్‌.. తొలిసారి ఎమ్మెల్యేవి.. అప్పుడే మంత్రి పదవి కావాలా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా అవకాశం వచ్చింది. ఓ సందర్భంలో పూర్తిగా వ్యాపారం వైపు వెళ్లాలనే ఆలోచన కూడా చేశా. అయితే అప్పటి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోనే కొనసాగా. నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ని కలిశా. అప్పుడు ఆయన ఓ షూటింగ్‌లో వరుడు వేషంతో ఉన్నారు" అని చంద్ర‌బాబు ఆనాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. 

"నా రాజకీయ ప్రయాణంలో ఎంతో మంది నేతలతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఎన్టీఆర్‌, వాజ్‌పేయీ లాంటి మహా నేతలతో కలిసి పనిచేశా. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు నా మాటకు ఎంతో విలువిచ్చేవారు. బాబు చెబితే అది కరెక్ట్‌ అనేవారు" అని మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయీతో త‌న అనుబంధాన్ని వివ‌రించారు చంద్ర‌బాబునాయుడు. 

చంద్రబాబు ప్రజా జీవితంలో సంచలనాలకు కొదవేలేదు. ముఖ్యమంత్రిగా తెలుగు జాతి గతినే మార్చేశారాయన. హైటెక్ సిటీతో తెలుగు నేలను ఐటీ హబ్‌గా మార్చేశారు. జ‌న్మ‌భూమితో జ‌న్మ‌భూమి రుణం తీర్చుకున్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న‌తో పేద‌ల‌కు అధికారాన్ని ద‌గ్గ‌ర చేశారు. 20ఏళ్ల క్రిత‌మే విజ‌న్ 2020 స్వ‌ప్నాన్ని కాంక్షించారు. డిప్ ఇరిగేష‌న్‌తో ఇజ్రాయిట్ టెక్నాల‌జీని కుప్పంకు ప‌రిచ‌యం చేశారు.  అమ‌రావ‌తితో న‌వ్యాంధ్ర త‌ల‌రాత లిఖించే ప్ర‌య‌త్నం చేశారు. ఇలా చంద్ర‌బాబు ప్ర‌జా జీవిత‌మంతా.. ప్ర‌జ‌ల కోసమే. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎల్ల‌ప్పుడూ.. ఎనీ డౌట్స్‌?