విమాన ప్రమాదం.. 41 మంది దుర్మరణం
Published on: Mon May 6, 2019 12:31PM

రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటనలో 41 మంది మృతిచెందారు. ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం మాస్కో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు విమానం వెనుక భాగంలో పెద్ద ఎత్తున అలముకున్నాయి. దీంతో అందులోని ప్రయాణికులు 41 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది విమానంలో ఉన్నారు. విమానంలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ముందువైపు ద్వారం నుంచి దిగారు. అలా 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భద్రతా నియమాలను పైలట్లు ఏమైనా ఉల్లంఘించారా? వంటి అంశాలపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తోంది.



