TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వేలల్లో పెండింగ్ చలానాలు.. టాప్ ప్లేస్ లో ఆ మంత్రి గారు

Published on: Mon May 6, 2019 5:36PM

 

చట్టాలు మనలాంటి సామాన్యులకేనా?. చట్టసభల్లో ఉండేవారికి వర్తించవా?. ఇప్పుడు కొత్తగా అనుకునేది ఏముంది.. తరతరాలుగా జరుగుతుంది అదేగా అంటారా?.  అవును ప్రజా ప్రతినిధులు చట్టాలను ఎప్పుడో వారి చుట్టాలుగా మార్చుకున్నారు. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఆఖరికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించడం, వేలల్లో చలానాలు పెండింగ్ లో ఉంచడంలో కూడా వారే ముందుంటున్నారు.

తెలంగాణలో పలువురి మంత్రుల, ఎమ్మెల్యేల ట్రాఫిక్ చలానాలు వేలల్లో పెండింగ్ లో ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్లండని నేతలు సామాన్యులకి అవగాహన కల్గించాల్సింది పోయి.. రోడ్డుపైన వాళ్ళే రయ్‌ మంటూ దూసుకెళ్తారు. ఇక అది పార్కింగ్ ప్లేసా?, నో పార్కింగ్ ప్లేసా?, రద్దీ రోడ్ల? ఇలాంటివేం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుతారు. పాపం ట్రాఫిక్ పోలీసులకు వారికి చెప్పే ధైర్యం లేక.. నిజాయితీగా వారి డ్యూటీ వారు చేస్తూ చలానా విధిస్తుంటారు. అయితే అలాంటి చలానాలకు మనలాంటి సామాన్యులు స్పందిస్తారు కానీ.. ఆ ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందిస్తారు. ఏళ్ల తరబడి తమ వాహనాలపై జారీ అవుతున్న చలానాలను వాళ్ళు అసలు పట్టించుకోవం లేదు. నోటీసులను బేఖాతరు చేస్తున్నారు. సామాన్యుడి విషయంలో మూడు, నాలుగు చలానాలు దాటితే రోడ్డుపై దొరికిన వాహనాలను దొరికినట్లు సీజ్‌ చేస్తూ.. చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టుకీడుస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. వారి విషయంలో అంత ధైర్యం చేయలేరు. దీంతో నేతల చలానాలు వేలల్లో పెండింగ్ లో ఉంటున్నాయి.

తెలంగాణలో వేలల్లో చలానాలు పెండింగ్లో ఉన్న నేతలు చాలామంది ఉన్నారు. వారిలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన వాహనంపై రూ.46,300 మేర చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 40 చలానాల్లో 36 అతివేగం సంబంధించినవే. ఇక ఆయన సతీమణి శారద పేరిట ఉన్న కారుపైనా రూ. 16,390 మేర 14 పెండింగ్‌ చలానాలున్నాయి. వాటిల్లో 13 అతివేగం వల్ల విధించినవే.

మరో మంత్రి ఈటల పేరిట కార్లు లేకున్నా.. ఆయన భార్య జమునకు మూడు కార్లు ఉన్నాయి. వాటిపై దాదాపు రూ. 27,000 విలువైన పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఇందులో నాలుగింటిపై పోలీసులు 2018లో లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు మూడు చలానాల బకాయిల విషయంలో పోలీసులు లీగల్‌ నోటీసులు పంపారు. ఆయన వాహనంపై రూ. 3,115 మేర మొత్తం 9 చలానాలు ఉన్నాయి.
 
మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి చెందిన వాహనానికి సంబంధించిన ఏడు చలానాల్లో.. నాలుగింటికి లీగల్‌ నోటీసులు జారీ అయ్యాయి. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ వాహనానికి 11 చలానాలు జారీ అయ్యాయి. రూ. 8,785 చెల్లించాల్సి ఉంది. 2015 అక్టోబరులో లీగల్‌ నోటీసులు పంపారు. కాగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరిట మూడు కార్లు, తన సతీమణి పేరిట ఒక కారు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన సతీమణి పేరిట ఉన్న కారుకు జారీ అయిన చలానాలను పరిశీలించగా ఆమె కారు నంబరును ఒక యువకుడు తన బైక్‌పై వేయించుకున్నాడు. దానిపై 6 చలానాలు జారీ అయ్యాయి.

మహిపాల్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, గువ్వల బాలరాజు, కౌసర్ మొహినుద్దీన్, బొల్లం మల్లయ్య, సిహెచ్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశం.. ఈ నేతల పేరు మీదున్న వాహనాలపై ఒక్కొక్కరికి రూ. పదివేలకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. నేతల పేరు మీదున్న వాహనాలపైనే ఇన్ని చలానాలు పెండింగ్ లో ఉంటే.. కొందరు నేతలు పదుల సంఖ్యలో వాహనాలు కొని తమ అనుచరుల పేరు మీద రిజిస్టర్ చేయిస్తూ ఉంటారు. ఇంకా ఆ చలానాలు ఎన్నెన్ని వేలల్లో పెండింగ్లో ఉన్నాయో ఏంటో.

లీగల్ నోటీసుల్ని కూడా పట్టించుకోకుండా చట్టం మాకు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్న నేతలు ఇకనైనా తమ పద్దతి మార్చుకొని.. చలానాలు చెల్లించి, ఇకపైనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆశిద్దాం. అయిన మన పిచ్చి కానీ ఇదంతా జరిగే పనేనా?.. ఏం చేస్తాం ప్రస్తుతానికి మన కర్మ అనుకోని మన మీద మనం జాలి పడటమే.