TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 35కు చేరిన మృతుల సంఖ్య

Published on: Tue Jul 1, 2025 8:35AM

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం (జూన్ 30) జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో  సంభవించిన పేలుడు, మంటల వల్ల ఇప్పటివరకు 35 మంది మరణించారు. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురి జాడ ఇంకా తెలియరాలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.   ఎన్డీఆర్ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు శాఖ సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నారు. భారీ వర్షం కురుస్తున్నా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.  ఇలా ఉంగగా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై కేంద్రం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.  

కాగా సంఘటనా స్థలాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జులై1) సందర్శిస్తారు. క్షతగాత్రులను పరామర్శిస్తారు. కాగా సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు అనంతరం.. ఆ పారిశ్రామిక వాడలో పక్కన ఉన్న పలు ఫ్యాక్టరీలను మూసివేశారు. ఎలాంటి కెమికల్ లీకేజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

ఇలా ఉండగా ప్రమాదానికి కారణం పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్యమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  కాగా ఈ ఘటనలో మరణించిన వారి దేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాతనే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.