సూర్యాపేటలో అష్టాచెమ్మ ఆడింది! 31 మందికి అంటించింది..
Published on: Thu Apr 23, 2020 1:21PM
లాక్‌డౌన్ ప్రభావంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. బోర్ కొట్టడంతో చాలా మంది సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులి-మేక, వామనగుండ్లు(ఒనగండ్లు), చెస్, క్యారమ్స్ లాంటి ఆటలతో కాలాన్ని గడిపేస్తున్నారు. ఓ మహిళ కూడా బోర్ కొట్టడంతో అష్టాచెమ్మ ఆడదామని పక్కింటికి వెళ్లింది. అలా కొన్ని ఇళ్లు తిరిగిందామె.
అయితే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ద్వారా అప్పటికే ఆమెకు కరోనా సోకింది. అలా.. ఆమె వల్ల పక్కింటి వాళ్లకు.. మొత్తం 31 మందికి కరోనా వ్యాప్తి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేటలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు అందర్నీ క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం సూర్యాపేటలో తాజాగా మరో మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది.


