ఏపీలో డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన ముగ్గురు బస్సు డ్రైవర్లు

 

'అసలే కోతి.. ఆ పైన కల్లు తాగింది' అన్నట్టు..  ప్రైవేట్ ట్రావెల్ బస్సుల డ్రైవర్లు అసలే మితిమీరిన వేగంతో బస్సుని రాకెట్ నడిపినట్టు నడుపుతారు. దానికి తోడు మద్యం సేవించి నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున డ్రంకన్ డ్రైవ్‌లో మద్యం సేవించి బస్సును నడుపుతున్న పలువురు డ్రైవర్లు అడ్డంగా బుక్కయ్యారు. మద్యాన్ని సేవించిన ముగ్గురు ప్రైవేట్ బస్సు డ్రైవర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంకట పద్మావతి ట్రావెల్స్, జీవీఆర్ ట్రావెల్స్, కనకదుర్గ ట్రావెల్స్‌లకు చెందిన డ్రైవర్లుగా గుర్తించారు. డ్రైవర్ల బాగోతం బట్టబయలు కావడంతో ప్రయాణికులంతా షాక్‌కు గురయ్యారు. మద్యం తాగి బస్సు నడపడం ఏంటని డ్రైవర్లపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

మందు కొట్టి బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డ్రైవర్ల వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బస్ డ్రైవర్లు మద్యం తాగడం అత్యంత తీవ్రమైన విషయమని.. వారందరి డ్రైవింగ్ లైసెన్స్ ల రద్దుతో పాటు, డ్రైవర్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయా ట్రావెల్స్ బస్సుల పర్మిట్లను రద్దు చేయాలని సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఇటువంటి ఘటనలను చూస్తూ ఊరుకోబోమని పోలీసు అధికారులు హెచ్చరించారు.