ఈటలకు కీలక పదవి! ఆ మూడు ఆఫర్లలో ఏది బెస్ట్?
Published on: Mon Jun 7, 2021 4:14PM
త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. టీఆర్ఎస్‌లో ఆయన కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతటివారు. తనకు కుడిభుజం లాంటి వారని స్వయంగా కేసీఆరే ఓ బహిరంగ సభలో ప్రకటించారు. ఇంకో అధికార పార్టీ నేత మాటల్లో చెప్పాలంటే రెండో సీఎం ఈటల రాజేందర్. ఆ స్థాయి నేత తెలంగాణలో అంతగా బలంలేని బీజేపీలో చేరితే.. ఇంకెంతంటి కీలక పదవి లభించాలి? పార్టీలో, ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కాలి? అనే అంశాలపై చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాషాయం పెద్దలను కలిసిన ఈటల.. ఆ మేరకు వారితో విస్తృతంగా చర్చించారట. వారి నుంచి కాస్త సంతృప్తికరమైన హామీ లభించాకే.. కాషాయ కండువా కప్పుకోటానికి ఈటల సిద్ధమయ్యారని అంటున్నారు.
టీఆర్ఎస్‌లో కేసీఆర్ నియంతృత్వ పోకడలు నచ్చలేదు. చినబాస్ కేటీఆర్ కింద పని చేయడం ఇష్టం లేదు. బానిసలా బతకలేక పార్టీని వీడుతున్నానని ఈటల స్పష్టం చేశారు. మరి, బీజేపీలోనైనా యజమాని కాగలుగుతారా? అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆరుసార్లు ఎమ్మెల్యే. పలుమార్లు మంత్రి పదవి. ఇక రాష్ట్ర స్థాయిలో ఆయన రాజకీయ జీవితంలో మిగిలింది రెండే రెండు పదవులు. ఒకటి పార్టీ అధ్యక్ష పదవి. ఇంకోటి ముఖ్యమంత్రి పీఠం. లేదంటే.. పార్లమెంట్ సభ్యత్వంతో పాటు కేంద్రమంత్రి హోదా. ఈ మూడే ఈటల ముందున్న బెస్ట్ ఆప్షన్లు.
ఇందులో మొదటి రెండు ఆప్షన్ల విషయానికి వస్తే.. పార్టీ పగ్గాలు.. ముఖ్యమంత్రి సీటు. ఈ రెండూ బీజేపీలో కాస్త కష్టమే అంటున్నారు. ఎందుకంటే.. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వారు కాకుండా కొత్త వారి చేతికి పార్టీని అప్పగించడం దాదాపు అసాధ్యం. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న రాష్ట్ర అధ్యక్షులు, ముఖ్యమంత్రులు అంతా ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నవారే. ఆ లెక్కన.. ఈటలకు ఈ రెండు పదవులు వరించడం కుదరకపోవచ్చు. అయితే, ఇక్కడే మరో పాయింట్ కూడా ప్రస్తావనకు వస్తోంది. ఇటీవల కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. తటస్తుడైన మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను బీజేపీలో చేర్చుకొని ఆయనను సీఎం క్యాండిడేట్‌గా ముందే ప్రకటించింది కాషాయదళం. కిరణ్‌బేడీ విషయంలోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేశారు. అదే విధంగా ఈటల విషయంలోనూ ఎగ్జెంప్షన్ ఇచ్చే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటే.. ఇప్పటికే బండి సంజయ్ ఉన్నారుగా అని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్‌కు ఇప్పటిలానే పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు కేంద్రంలోకి తీసుకుంటే.. అప్పుడు ఈటలకు రూట్ క్లియర్ అవుతుందనేది ఓ అంచనా. అయితే.. కేంద్ర పెద్దల ఆశీస్సులు బలంగా ఉన్న కిషన్‌రెడ్డిని కాదని.. బీసీని ముఖ్యమంత్రిని చేసేంత సాహసం బీజేపీ చేస్తుందా అనేది కీలకాంశం.
ఇక, పార్టీ పగ్గాలు, ముఖ్యమంత్రి పదవి తీసేస్తే.. ఇప్పటికిప్పుడు ఈటల ముందున్న మరో ఆప్షన్ రాజ్యసభ పదవి + కేంద్ర మంత్రి. తొలి నుంచీ ఇదే ప్రచారం జరుగుతోంది కూడా. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల సతీమణి జమునారెడ్డితో పోటీ చేయించి.. రాజేందర్‌ను రాజ్యసభకు పంపి.. కేంద్రమంత్రిని చేస్తారనే దిశగా బీజేపీ అధిష్టానం నుంచి లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్రంలో కిషన్‌రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉండడంతో ఈటలకు బెర్త్ దాదాపు కన్ఫామ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ హామీతోనే ఈటల బీజేపీలో చేరుతున్నారని.. కాషాయం పార్టీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు సైతం రాజేందర్ సిద్దమయ్యారని టాక్.
ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరగాలంటే.. హుజురాబాద్‌లో ఈటల గెలుపు తప్పనిసరి. అది ఆయనే పోటీ చేసినా.. లేక, ఆయన సతీమణి బరిలో నిలిచిన.. ఎలాగైనా గెలిచి తీరాల్సిన తప్పనిసరి పరిస్థితి. అయితే, అది అంత ఈజీగా అయ్యే పనిలా కనిపించడం లేదు. కేసీఆర్ వేగంగా కదుపుతున్న పావులకు.. ఇప్పటికే ఈటల వర్గం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గులాబీ కేడర్ అంతా టీఆర్ఎస్‌లోనే ఉండేలా నయానా, భయానా కట్టడి చేయడంలో అధికార పార్టీ సక్సెస్ అవుతోంది. స్థానిక బీజేపీ శ్రేణులు సైతం ఈటల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేత పెద్దిరెడ్డికి ఇప్పటికే టీఆర్ఎస్ గాలం వేసి రెడీగా ఉంచింది. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ వెంట పట్టుమని పది మంది నేతలు కూడా లేని దుస్థితి. అయినా, నియోజక వర్గ ప్రజలే తనను గెలిపించుకుంటారనే ధీమా ఆయనలో కనిపిస్తోంది. తన తెగువకు, బీజేపీ దూకుడు తోడైతే.. హుజురాబాద్‌లో అధికార పార్టీ పప్పులు ఉడకవని భావిస్తున్నారు. రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన ఈటల ఎపిసోడ్.. ఇటు రాజేందర్‌కు, అటు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. భవిష్యత్తులో ఈటల ముఖ్యమంత్రి కావాలన్నా.. బీజేపీ పగ్గాలు చేపట్టాలన్నా.. కేంద్రమంత్రి అవ్వాలన్నా.. హుజురాబాద్‌లో గెలవడం తప్పనిసరి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఇటు వ్యక్తిగతంగా, అటు పార్టీ పరంగా.. తీరని నష్టం.


