TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2జి స్కాం:యుపిఏ సర్కారుకు ముంచుకొస్తున్న ముప్పు

Published on: Sat Feb 4, 2012 8:33AM

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రం కుంభకోణంలో హోంమంత్రి పి చిదంబరం సహనిందితుడు అవుతాడా? అదే జరిగితే యుపిఏ సంకీర్ణ సర్కారు మనుగడ కొనసాగించగలుగుతుందా? చిదంబరాన్ని సహనిందితునిగా ప్రకటించాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీలోని పటియాలా హౌజ్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఓపి సైనీ శనివారం ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సంకీర్ణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేతలను వేధిస్తున్నాయి. సంకీర్ణ సర్కారు నేతలు శనివారంనాటి తీర్పు కోసం గుండెను చిక్కబట్టుకుని వేచి చూస్తుంటే, ప్రతిపక్షం మాత్రం కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడేందుకు సిద్ధమవుతోంది.


2జి స్పెక్ట్రమ్ కేసులో హోంమంత్రి చిదంబరాన్ని సహ నిందితునిగా చేర్చాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం తన తీర్పును ప్రకటించనుంది. దీంతో కుంభకోణంలో చిదంబరానికి పాత్ర ఉందా? లేదా? అన్న దానిపై సస్పెన్స్‌కు శాశ్వతంగా తెరపడుతుంది. వ్యవహారాన్ని కింది కోర్టే తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో బంతి ఇప్పుడు సిబిఐ ప్రత్యేక జడ్జి ఒపి సైనీ కోర్టులో ఉంది. సుప్రీం కోర్టు గురువారం 2జి స్పెక్ట్రం కేసుపై తీర్పునిస్తూ 122 లైసన్సులను రద్దు చేయటం తెలిసిందే. తీర్పుమూలంగా సంకీర్ణ సర్కారు సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో శనివారం ట్రయల్ కోర్టు కూడా ప్రతికూల తీర్పునిస్తే సంకీర్ణ ప్రభుత్వం మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుందని భయపడుతున్నారు. మరోవైపు ట్రయల్ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే చిదంబరం రాజీనామా డిమాండ్ చేయటంతోపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని మరోసారి బజారుకు ఈడ్చేందుకు బిజెపి, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. అందుకే అందరి కళ్లూ శనివారం పటియాలా హౌజ్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి సైనీ ఇవ్వనున్న తీర్పుపై కేంద్రీకృతమై ఉన్నాయి.