కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో 28 ఏళ్ళ కుర్రాడు!!

 

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఆ పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరా అని అటు పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు సీనియర్లు, కేంద్ర మాజీ మంత్రులు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబం నిర్వహిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ రాహుల్ మాత్రం గాంధీ కుటుంబేతర వ్యక్తికి పదవి అప్పగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షులు ఎవరా అని అందరిలోనూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూణెకు చెందిన 28 ఏళ్ల ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ గజానంద్ హోసాలే అనే వ్యక్తి ఆ పోస్టుపై కన్నేశాడు. ప్రస్తుతం ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్న గజానంద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించాడు.

ఈ విషయంపై స్పందించిన గజానంద్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసాడు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ డైలమాలో పడిపోయిందని, ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై పార్టీలో గందరగోళం నెలకొందని గజానంద్ పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ పదవి కోసం నామినేషన్ వేయాలని అనిపించిందని పేర్కొన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డాడు. రాహుల్ గాంధీ యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న గజానంద్.. వయసులో చిన్నవాళ్లు అయినంత మాత్రాన సరిపోదని, ఆలోచనా విధానం కూడా బాగుండాలని పేర్కొన్నాడు. కాగా, పార్టీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న గజానంద్‌కు ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో తనకు కనీసం సభ్యత్వం కూడా లేదని తెలిపాడు. మరి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని గజానంద్ దరఖాస్తుని అసలు కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.