కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి.. 2 గంటలకు తొలి ఫలితం

 

రేపు ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. తాజాగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని.. మొదట పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు.

ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 12 గంటలలోపు ట్రెండ్స్ తెలిసిపోతాయని అన్నారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని తెలిపారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని ద్వివేది చెప్పారు.

అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీప్యాట్ స్లిప్స్ లెక్కిస్తామని అన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం రావచ్చని అభిప్రాయపడ్డారు. వీవీప్యాట్స్ స్లిప్పుల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడిస్తామని.. ఇ-సువిధ యాప్, ఈసీఐ వెబ్ సైట్ లో ఎన్నికల ఫలితాలు చూడొచ్చని తెలిపారు.

ఓట్ల లెక్కింపులో 25 వేల సిబ్బంది పాల్గొంటారని, కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 25 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని, అదనంగా పది కంపెనీల కేంద్ర బలగాలు వచ్చినట్టు ద్వివేది వివరించారు.