గ్యాంగ్ స్టర్ దూబే కు బీజేపీ ఎమ్మెల్యేల అండ..!  వీడియో వైరల్..

యూపీలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులలో ఒక డిఎస్పీ తో సహా 8 మందిని గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇపుడు దూబే ను పట్టుకోవడానికి యూపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఐతే దూబే గతంలో మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భగవతి ప్రసాద్ సాగర్, అభిజీత్ సంగా అనే ఇద్దరు బీజేపీ ఎమ్మేల్యేలు తనకు అండగా ఉన్నారని అలాగే పలువురు ఇతర స్థానిక నాయకుల పేర్లు కూడా అతను ఆ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. 2017 లో యూపీ ఎస్టీఎఫ్ ఇంటరాగేషన్ లో పోలీసులకు అతడు ఈ వివరాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా తాను ఆ నాయకులను వ్యక్తిగతంగా కలిశానని అతడు ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఐతే దీని పై స్పందించిన ఎమ్మెల్యే సాగర్ తనకు దూబే తో పరిచయం లేదని అతడి అకృత్యాలకు తాను ఎపుడు సపోర్ట్ చేయలేదని అతడు ఒక నేరస్తుడు కనుక ఎవరి పేరైన చెప్పే అవకాశం ఉందని మీడియా తో అన్నారు. ఈ వీడియో తో తన ఇమేజ్ ను దెబ్బతీయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని అయన అన్నారు. మరో బీజేపీ ఎమ్మెల్యే అభిజీత్ సంగా ఈ వీడియో పై స్పందిస్తూ.. కాన్పూర్ పరిధిలోని తన నియోజకవర్గం బితుర్ చుట్టూ పక్కల గ్రామాల నుండి ప్రజలు సహాయం కోసం తన వద్దకు వస్తారని ఐతే దుబే చేసే అకృత్యాల పై చర్యలు తీసుకోవాలని తాను పోలీసులను కోరినట్లు అయన వివరించారు. ఈ వీడియో పై దర్యాప్తు జరపవలసిందిగా ఈ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు పోలీసులకు విజ్ఞప్తి చేసారు.