20వేల పోలీస్ జాబ్స్.. త్వరలోనే నోటిఫికేషన్..
Published on: Sun Jun 13, 2021 9:49AM
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు. ఏళ్ల తరబడి ఉద్యోగాల భర్తీ అటకెక్కడంతో చదువుకున్న వారు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం.. సర్కారుపై ఒత్తిడి పెరుగుతుండటంతో.. ఉద్యోగాల భర్తీకి పూనుకుంటున్నారు. త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ ఇటీవలే ప్రకటన కూడా చేశారు. తాజాగా 20వేల పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ.
తెలంగాణలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది ప్రభుత్వం. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీతో పోలీసింగ్ సిస్టమ్‌ను అమాంతం మార్చేశారు. సీసీకెమెరాలు, ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టమ్‌తో కమ్యూనిటీ సెక్యూరిటీని మరింత టైట్ చేస్తున్నారు. ఆ మేరకు పోలీస్ శాఖలో సిబ్బందినీ పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది. అందుకే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. ఇప్పటి వరకూ పోలీస్ శాఖలోనే అధికంగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. తాజాగా, మరోసారి 20వేల పోలీస్ జాబ్స్‌కు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామంటూ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కారు. కొత్త నోటిఫికేషన్‌లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హోంమంత్రి ప్రకటించడం విశేషం.


