ఏపీలో కోటి మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది.. తేల్చిన లేటెస్ట్ సర్వే

ఏపీ ప్రస్తుత జనాభా 5 కోట్లకు పైగా ఉంది. ఐతే అధికారికంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. అయితే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే ఏకంగా కోటి మందికి కరోనా వైరస్‌ సోకి తగ్గిపోయిందని సీరో తాజా సర్వేలో తేలింది. మన రక్తంలోని సీరంలో ఉన్న యాంటీ బాడీస్‌ ఆధారంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సీరో సర్వే నిర్వహించింది. ముందుగా తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్‌ సోకి, తగ్గిపోయినట్లుగా తేలింది. తాజాగా రెండో దశలో మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ మీడియాకు తెలిపారు.

తాజాగా జరిపిన సిరో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45వేల మంది నుండి శాంపిల్స్‌ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే కరోనా వైరస్‌ సోకి దానంతట అదే తగ్గిపోయినట్టుగా తేలింది. అంతేకాకుండా వైరస్‌ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక జిల్లాల వారీగా చూస్తే విజయనగరం జిల్లా లో అత్యధికంగా 30.6 శాతం మంది నమూనాల్లో కరోనా యాంటీ బాడీ్‌సను గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లా 21.5 శాతం, చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయి. ఇక కరోనా యాంటీ బాడీస్ విషయంలో 12.3 శాతంతో పశ్చిమ గోదావరి చివరి స్థానంలో ఉంది.

ఈ సర్వేను బట్టి తేలిందేంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా వైరస్‌ ఉధృతి పెరగవచ్చు. అయితే ఇదే సమయంలో విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఏయే జిల్లాలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లుగా కమిషనర్‌ భాస్కర్ తెలిపారు. ఈ సర్వే ఫలితాలు వ్యాధి సంక్రమణ తీవ్రతను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్‌ కార్యాచరణకు ఉపయోగ పడతాయి. దీనికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో కొవిడ్‌ ఆసుపత్రుల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చుఅని అయన తెలిపారు. తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన సీరో సర్వేలో 29.8 శాతం రిజల్ట్‌ వచ్చిందని దని తరువాత నుండి ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇక మన రాష్ట్రంలో తొలిదశలో నిర్వహించిన సీరో సర్వేలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 21.7 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీలు కనిపించాయి.. అప్పటి నుండి ఈ జిల్లాలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా కొంత తగ్గుముఖం పట్టింది.