TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలో 20కి పెరిగిన కరోనా స్ట్రెయిన్ కేసులు! 

Published on: Wed Dec 30, 2020 11:19AM

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కరోనా స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ కొత్త కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. మంగళవారం వరకు కొత్త కరోనా కేసులు కేవలం ఆరు మాత్రమే ఉండగా.. 24 గంటల్లోనే  మొత్తం 20 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. మంగళవారం నాడు ఆరుగురికి కొత్త వైరస్ సోకిందని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ, తాజాగా.. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ న్యూ స్ట్రెయిన్ కనిపించిందని స్పష్టం చేసింది. కోల్ కతా, పూణేలో ఒక్కో కేసు, బెంగళూరులో  7, హైదరాబాద్ లో  3, ఢిల్లీలో   2 కరోనా  స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.  నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య యూకే నుంచి భారత్ కు వచ్చిన 33 వేల మందికి ఇప్పటి వరకు టెస్ట్ లు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఇప్పటి వరకు 20 మందికి కరోనా సోకినట్లు కేంద్రం ఆరోగ్యశాఖ నిర్ధారించింది. 

యూకే కరోనా కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. జినోమ్ పరీక్షల దేశంలో 10 ల్యాబ్ లు ఏర్పాటు చేసింది. కరోనా కొత్త వైరస్ సోకిన బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులను ట్రేస్ చేసి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తోంది. కరోనా స్ట్రెయిన్ సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన వారందరిని  క్వారంటైన్ కు తరలిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. కరోనా స్ట్రెయిన్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు.  రూపాంతరం చెందిన కరోనా  70 శాతం వరకూ వేగంగా వ్యాపిస్తున్నా.. పెద్దగా భయపడాల్సిందేమీ లేదని చెబుతున్నారు. కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పాటిస్తుంటే కొత్త వైరస్ కూడా సోకకుండా ఉంటుందని సీసీఎంబీ పేర్కొంది. మాస్క్ లు, భౌతికదూరం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం ద్వారా కొత్త స్ట్రెయిన్ కు కూడా దూరంగా ఉండవచ్చని  సూచిస్తోంది. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్  కొత్త స్ట్రెయిన్ ను కూడా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.