యుద్ధనౌకలో మహిళా అధికారులు

కొత్త చరిత్రకు భారతీయ మహిళల శ్రీకారం

 

ప్రపంచయుద్ధాల్లో పాల్గొన్న మహిళల సంఖ్య తక్కువేమీ లేదు. కానీ, వారి సేవలు ప్రపంచం ముందుకు రాలేదు. ప్రస్తుతం మనదేశంలో త్రిదళాల్లో పనిచేస్తున్న మహిళల జాబితాలోకి మరో ఇద్దరు యువతులు చేరారు. నౌకాదళంలోని యుద్ధ హెలికాప్టర్లను నడిపే సామర్ధ్యం ఉన్న ఇద్దరు సబ్ లెఫ్టినెంట్లను నౌవీలోకి తీసుకుంటూ ఇండియాన్ నేవీ ప్రకటన చేసింది. లింగవివక్షను రూపుమాపుతూ ఇండియన్ నేవీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారతీయ మహిళలంతా అభినందిస్తున్నారు. నేవీలో చాలామంది మహిళలు పనిచేస్తున్న యుద్ధనౌకల్లో మొదటిసారి ఇద్దరు మహిళలకు ప్రవేశం కల్పించారు.

 

నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న కుముదిని త్యాగి, రీతి సింగ్ లకు యుద్ధ హెలికాప్టర్లు నిర్వాహణలో శిక్షణ ఇచ్చారు. సోమవారం కొచ్చిలో జరిగిన ఐఎన్ఎస్ గరుడలో జరిగిన కార్యక్రమంలో వారిద్దరికి బాధ్యతలు ఇస్తూ ఎంహెచ్ 60 ఆర్ హెలికాప్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని  ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక హెలికాప్టర్లుగా పేరుగాంచిన ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్లు శత్రుదేశాల నౌకలను, సబ్ మెరెన్స్ లను గుర్తిస్తాయి. అంతేకాదు వీటికి మిస్పైల్స్ టార్పెడోస్ ను కూడా ఫిక్స్ చేయవచ్చు.

 

కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వీరిద్దరూ 2018 లో నేవీలో చేరారు. కుముదిని త్యాగి, రీతి సింగ్ హెలికాప్టర్ నడపడంలోనూ, ఇంటలిజెన్స్,  సెన్సార్లు ఆపరేటింగ్ విభాగంలోనూ శిక్షణ పూర్తి చేశారు.  రీతి సింగ్  హైదరాబాద్‌కు చెందిన యువతి. సైనిక కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాత ఆర్మీలో,  తండ్రి  నావికాదళంలో పనిచేశారు. నేవీలో అధికారిగా బాధ్యతలు నిర్వహించాలన్నది తన జీవితాశయం అన్నారు. ఘజియాబాద్‌కు చెందిన సబ్ లెఫ్టినెంట్ త్యాగి మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అవకాశం ఇస్తే సత్తా చూపిస్తామన్నారు.  చైనా, భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తలు నేలకొన్న తరుణంలో యుద్ధనౌకల్లో పనిచేసే అవకాశం అందుకొని వారిద్దరూ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.