విశాఖలో మరో గ్యాస్ లీక్ దుర్ఘటన.. ఇద్దరు మృతి

విశాఖ లో ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరిచిపోక ముందే మరో సారి గ్యాస్ లీక్ దుర్ఘటన చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్ సైన్సెస్ లోని రియాక్టర్ నుంచి బెంజీన్ మేడిజోన్ అనే విష వాయువు లీకైంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షిఫ్ట్‌ ఇంచార్జ్‌ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా వారిని గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఈ దుర్ఘటన గురించిన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాద ఘటనపై నలుగురు అధికారులతో కమిటీని నియమించినట్లు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. మరోవైపు ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.