సెల్‌ నంబర్‌కి 13 అంకెలా? డోన్ట్ వర్రీ!!

ఇప్పుడు మనం ఉపయోగించే సెల్‌ఫోన్లకి 10 అంకెలున్న నంబర్లుంటాయి కదా... ఇకపై ఆ అంకెలు పదమూడుకి పెరగనున్నాయా? డిసెంబర్ 31, 2018 లోపు మన సెల్‌ఫోన్ల నంబర్లని 13 అంకెల నంబర్లకి మార్చుకోవాలా? దీనివల్ల మన పాత నంబర్లన్నీ మారిపోతాయా? పది అంకెలున్న నంబర్లే గుర్తుంచుకోలేని పరిస్థితిలో వున్న మనం 13 అంకెలున్న నంబర్లు గుర్తుంచుకోవాలంటే బుర్ర వాచిపోతుందా? లేటెస్ట్‌గా ఇండియన్ టెలీకాం డిపార్ట్‌మెంట్ కొన్ని రకాల సెల్‌ఫోన్ నంబర్లను 10 నుంచి 13 నంబర్లకు మార్చుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. డిసెంబర్ 31 లోగా నంబర్లను మార్చుకోవాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు కూడా ఇచ్చేసింది.

 

ఈ విషయం బయట పడినప్పటి నుంచి దేశంలో సెల్‌ఫోన్లను వినియోగిస్తున్న కోట్లాదిమంది టెన్షన్లో పడిపోయారు. ఈ నంబర్లు పెంచుడేందిరో అని అనుకోవడం ప్రారంభించారు... అయితే మనలాంటి సెల్‌ఫోన్ కస్టమర్లు ఎవరూ టెన్షన్ పడాల్సిన పనిలేదు... మన నంబర్లని మార్చుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అదేంటీ? 10  నంబర్ల నుంచి 13 నంబర్లకు మారాలని కేంద్ర టెలీకం శాఖ నిజంగానే ఆదేశాలు జారీ చేసింది కదా అనుకుంటున్నారా?

 

నిజమే.. ఆదేశాలు జారీ చేసిన మాట నిజమే... అయితే ఆ ఆదేశాలు వర్తించేది మనం వాడే సెల్ నంబర్లకు కాదు.. ఎం టు ఎం సెల్‌ఫోన్ నంబర్లకు.. ఎం టు ఎం అంటే... మెషిన్ టు మెషిన్ సెల్‌ఫోన్ నంబర్లకు. ఇంతకీ మెషిన్ టు మెషిన్ సెల్‌ఫోన్లు అంటే ఏమిటి? సెల్ ఫోన్ ద్వారా మిషన్లను అంటే... టీవీలు, ఏసీలు... తదితర మిషన్లను ఆపరేట్ చేస్తూ వుంటారు కదా... అలాంటి సెల్ ఫోన్లకు మాత్రం 10 అంకెలకు బదులు 13 అంకెలున్న నంబర్లు ఉపయోగించాల్సి వుంటుంది. దాని వల్ల సదరు మిషన్ టు మిషన్ సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చట. అంచేత మన సెల్ నంబర్లు నిక్షేపంగా 10 నంబర్లతోనే వుంటాయి... వాటిని 13 నంబర్లకు మార్చుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.. అంచేత డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ!.