తెలంగాణలో 12వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం

పాఠశాలల సంఖ్యను కుదించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఒక పాఠశాలకు మరో పాఠశాలకు మధ్య అయిదు కిలోమీటర్ల దూరం వుండేలా చర్యలు తీసుకునున్నట్లు సమాచారం. సర్కారు విద్యా చట్టం సవరణ చేయటంతో పది నుంచి పన్నెండు వేల పాఠశాలలు మూతపడనున్నాయి.కనీస స్థాయిలో విద్యార్థులు లేని సర్కారీ పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అవరోధంగా నిలిచిన విద్యా హక్కు చట్టానికి కీలక సవరణలు తలపెట్టింది. ఇందులో భాగంగానే ఊరికి.. పాఠశాలకు మధ్య అనుమతించదగ్గ గరిష్ఠ దూరాన్ని ఐదు కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీని పై పరిశీలనకు ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కమిటీలో హైదరాబాద్ ఆర్జేడీ,డీఈవో రంగారెడ్డి డీఈవో, రెండు జిల్లాల నుంచి ఒక డిప్యూటీ ఈవో, ఎంఈవోతో పాటు సమగ్ర శిక్షణ ఏఎస్పీడి సభ్యులుగా ఉన్నారు. విద్యా హక్కు చట్టం సవరణల పై పరిశీలన చేయాలని విద్యా శాఖ ఈ కమిటీని ఆదేశించింది.దీని పై ఈ నెల ( నవంబర్ 22న) సమావేశం నిర్వహించనున్నారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక కిలో మీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రాధమిక ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధనను మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చిన నిబంధనల ప్రకారం ఏ పాఠశాల అయినా సరే ఐదు కిలో మీటర్ల పరిధిలో ఒకటి ఉంటే సరిపోతుంది. దీనివల్ల రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాఠశాలలు మూతపడే అవకాశముంది. ఇప్పటికే సుమారు నాలుగు వేల స్కూళ్ల వరకు మూసివేతకు రంగం సిద్ధం చేసిన అధికారులు ఇప్పుడు ఈ కొత్త నిబంధనతో మరిన్ని స్కూళ్లు మూసివేసే అవకాశం ఉంది. దీని పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నిర్ణయం అమలైతే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్య కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 10,000 నుంచి 12,000 వేల పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని ఓ ఉపాధ్యాయుడు అంచనా వేశారు.ఇందులో మెజారిటీ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలే కావడం గమనార్హం. ఈ పాఠశాలలే కిలో మీటరుకు ఒకటి ఉండటమే ఇందుకు కారణం. 

గతంలోనే 15 మంది విద్యార్ధుల లోపు ఉన్న పాఠశాలను దగ్గర లోని పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. దీంతో 3000 బడులు మూతబడతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో మొత్తం  26,050 ప్రభుత్వ పంచాయతీ రాజ్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,230 ప్రాథమిక 3,179 ప్రాథమిక ఉన్నత, 4641  యొక్క ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 916 పాఠశాలల్లొ జీరో అడ్మిషన్ లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.విద్యా శాఖ నిర్ణయం అమలయితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు దాదాపుగా 70% శాతం మూతపడే ప్రమాదముంది. స్కూళ్ల మధ్య దూరాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమం తప్పదని ఈ నిర్ణయం వల్ల భారీగా సర్కారీ బడులు ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని అంటున్నారు. దీంతో గ్రామీణ తండాల్లోని విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.