ఆర్మీ అధికారి అరాచకం.. 125 కోట్ల మోసం...

ఆర్మీ జ‌వాన్లు సిన్సియ‌ర్‌గా ఉంటారు. ప్రాణాలు పోయినా త‌ప్పుడు ప‌నులు చేయ‌ర‌ని అనుకుంటారు. అయితే, అంద‌రు ఆర్మీ వాళ్లూ ఒకేలా ఉండ‌రు. అందులోనూ కొంద‌రు వెద‌వ‌లు ఉంటారు. అలాంటి ఓ ఆర్మీ సోల్జ‌ర్‌.. ఓ భారీ మోసానికి పాల్ప‌డ్డారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టి 50 కోట్లు అప్పుల పాల‌య్యాడు. ఆ అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు.. ఆర్మీ ముసుగులో ఏకంగా 125 కోట్లు దోచేశాడు. విదేశాల‌కు పారిపోవాల‌నుకున్నాడు. అంత‌లోనే  ఆ ఆర్మీ ఆఫీస‌ర్ బండారం బ‌య‌ట‌ప‌డ‌టంతో.. వాడి ఖేల్‌ ఖ‌తం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌)లో డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేస్తున్నాడు ప్రవీణ్‌ యాదవ్‌. డిప్యూటేషన్‌పై నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ) కన్‌స్ట్రక్షన్‌ విభాగంలో గతేడాది వరకు విధులు నిర్వహించాడు. ఎస్‌ఎన్‌జీకి పలు నిర్మాణాలు చేపట్టాలని నకిలీ టెండర్లు ప్రకటించాడు. లావాదేవీల కోసం ఎన్‌ఎస్‌జీ పేరు మీద నకిలీ బ్యాంకు ఖాతా తెరిచాడు. టెండర్ల కోసం కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో నగదును అందులో జమ చేశారు. అలా వారి నుంచి దాదాపు రూ. 125కోట్లు వసూలు చేశాడు. త‌న‌ మోసం బయటపడకముందే విదేశాలకు పారిపోవాలని.. స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నాడు. రిటైర్‌మెంట్ ప్రాసెస్ న‌డుస్తుండ‌గానే అత‌ని పాపం పండింది.

రెండు నెలలు గడిచినా నిర్మాణ పనులపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఎన్‌ఎస్‌జీని సంప్రదించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. మోసపోయినట్లు గుర్తించిన కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టి ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఎస్‌జీలోనే పనిచేసే తన సోదరి సాయంతో ఈ మోసానికి పాల్పడ్డాడని, ఆ డబ్బులో 50కోట్ల మేర తనకున్న రుణాలు చెల్లించాడని పోలీసులు గుర్తించారు. మిగ‌తా సొమ్ముతో విదేశాల‌కు పారిపోవాల‌ని స్కెచ్ వేశాడు. అంత‌లోనే పోలీసుల‌కు చిక్కాడు.