ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 111 మంది రైతులు పోటీ

 

లోక్ సభ ఎన్నికల వేళ రైతులు వినూత్న నిరసనకు దిగుతున్నారు. ఇన్నాళ్లు రోడ్డెక్కి గొంతు చించుకొని తమ బాధలు చెప్పుకున్నా పట్టించుకున్నవారు లేరు. దీంతో అందరికీ తమ నిరసన తెలిసేలా.. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో వందలు, వేల సంఖ్యలో నామినేషన్లు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో 500 నుంచి 1000 దాకా నామినేషన్లు వేస్తామని పసుపు రైతులు ప్రకటించారు. అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కూడా 200 నామినేషన్లు వేయనునున్నట్లు సుబాబుల్ రైతులు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రైతుల నామినేషన్ల నిరసన సెగ ప్రధాని మోదీని కూడా తాకనుంది.

మోదీ పోటీచేయనున్న వారణాసి నియోజకవర్గంలో 111 మంది తమిళ రైతులను బరిలో నిలపనున్నట్లు దక్షిణాది నదుల అనుసంధాన పథక రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను వెల్లడించారు. అయ్యాకన్ను నేతృత్వంలో గతంలో ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద 15 రోజులపాటు రైతులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కావేరి వ్యవహారం, పంట రుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు ఉద్యమించారు. అయినా ఫలితం లేదు. దీంతో తమిళ రైతుల సమస్యలను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు సార్వత్రిక ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు ప్రధాని మోదీ పోటీచేయనున్న వారణాసిలో 111 మంది రైతులను బరిలోకి దింపి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు అయ్యాకన్ను తెలిపారు.