సొమ్ముసర్కారీది ...షోకు జీవీకేది !
Published on: Sat Dec 31, 2011 8:22AM
హైదరా
బాద్: 108 సేవల మాటున భారీ దోపిడీ జరుగుతోంది. సగం వ్యాన్లు మూలన పడినా ఉన్న వాన్లు నిర్దేశిత ట్రిప్పులు తిరగకపోయినా జీవీకే సంస్థ సర్కారు నుంచి వందశాతం సొమ్ము వసూలు చేసుకుంటోంది. 'సత్యం' కుంభకోణం బయట పడిన తర్వాత రామలింగరాజు 108 సేవలు అందించే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను వదులుకున్నారు.అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ఏరికోరి జీవీకే సంస్థకు 108 బాధ్యతలు అప్పగించారు. 2011 సెప్టెంబర్ 19 వరకు ఎలాంటి ఒప్పందం లేకుండానే వ్యాన్లు నడిచాయి. ఆ తర్వాత జీవీకే సంస్థ ప్రభుత్వంతో ఐదేళ్లకు ఎంఓయూ చేసుకుంది. ఈఎంఆర్ఐని టేకోవర్ చేసే సందర్భంలో జీవీకే సంస్థ కేవలం రూ.60 కోట్లను మాత్రమే చెల్లించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా అదనంగా వెచ్చించలేదు.ప్రభుత్వం చెల్లించే నిర్వహణ నిధులతోనే వ్యాన్లను నడుపుతున్నారు. నిజానికి సాంకేతిక సహాయం కింద జీవీకే సంస్థ 5 శాతం నిధులను భరించాలి. ఆ డబ్బుతోనే కంప్యూటర్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఉన్నత స్థానాల్లో ఉండే వివిధ విభాగాల హెడ్లు, డైరెక్టర్లు, ఆర్ఎంలు, డీఎంలకు వేతనాలు చెల్లించుకోవాలి. కానీ ఇప్పుడు మొత్తం వంద శాతం సొమ్ము సర్కారు నుంచే వసూలు చేస్తోంది. జీవీకే సంస్థకు మాత్రం ప్రచారానికి ప్రచారం, డబ్బుకు డబ్బు!
రాష్ట్రంలో మొత్తం 752 వ్యాన్లు సేవలు అందించాలి. కానీ... రిపేర్లు, డీజిల్ కొరత, టైర్లు పాడు కావడం, ప్రమాదాలు, ఇతరత్రా కారణాల వల్ల 368 వ్యాన్లు మూలన పడ్డాయి. 434 వ్యాన్లు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ జీవీకే సంస్థ త్రైమాసిక నిధుల కింద మొత్తం 752 వ్యాన్లకు రూ.21.43 కోట్ల నిధులను సర్కారు నుంచి వసూలు చేస్తోంది.అంటే 318 వాహనాలు 'టైరు' బయట పెట్టకున్నా వాటికి సంబంధించి ప్రతినెలా దాదాపు రూ.3 కోట్లు జీవీకే దిగమింగుతోంది. సగటున 33 శాతం వాహనాలు రోడ్డెక్కడం లేదని జీవీకే-ఈఎంఆర్ఐ స్వయంగా అంగీకరించింది. పోనీ తిరుగుతున్న వ్యాన్లయినా పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నాయా అంటే అదీ లేదు! ఒక్కో వ్యాన్ సగటున 3 నుంచి 4 ట్రిప్పులు తిరగాలని ఒప్పందంలో ఉంది. కానీ ఒకటీ అర వ్యాన్లు తప్ప మిగిలినవేవీ నిర్దేశిత ట్రిప్పులు తిరగడం లేదు. అయినప్పటికీ పూర్తిస్థాయి ట్రిప్పులు తిరిగినట్లుగా ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారు.
108ను సత్యం సంస్థ నిర్వహిస్తుండగా ఒక్కో వ్యానుకు ప్రభుత్వం నెలకు రూ.70వేలలోపే చెల్లించేది. ఇప్పుడు.. జీవీకేకు ఏకంగా రూ.95 వేలు చెల్లించేందుకు అంగీకరించింది. అంతేకాదు ఈ మొత్తాన్ని ఏటా 6 శాతం పెంచాలంటూ జీవీకే సంస్థ పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించింది. మరో విషయమేమిటంటే ప్రస్తుతం ఈఎంఆర్ఐ పేర యాక్సిస్ బ్యాంకు నుంచి రూ.42 కోట్ల రుణం ఉంది. దీనిపై ఏటా రూ.50 లక్షల వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ తాను తీసుకోని రుణానికి వడ్డీ ఎందుకు చెల్లిస్తామంటూ వడ్డీ చెల్లించేందుకు ససేమిరా అంది. ఈ వడ్డీ మొత్తాన్ని వ్యాన్ల నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము నుంచే సర్దుబాటు చేసింది.ఇలా మళ్లించిన రూ.11.78 కోట్లను ప్రభుత్వం ఇటీవలే జీవీకే నుంచి రికవరీ చేసింది. ఇకపై ఇలాంటి సమస్య రాకుండా జీవీకే 'మాస్టర్ ప్లాన్' వేసినట్లు తెలిసింది. తాజాగా కాల్ సెంటర్ అద్దె కింద ఒక్కో వ్యానుకు రూ.5,608 చొప్పున ప్రతినెలా రూ.42,17,216 చెల్లించేలా ఎంఓయూ కుదుర్చుకుంది. ఇదే మొత్తాన్ని యాక్సిస్ బ్యాంకులో వడ్డీ కింద చెల్లించవచ్చన్న మాట!
108 వ్యాన్ల నిర్వహణలో జీవీకే రకరకాల అవకతవకలకు పాల్పడతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. పైగా ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందంలో జీవీకే పెట్టిన షరతులన్నింటికీ తలాడించింది. సర్కారు మాట ఒక్కటంటే ఒక్కటీ చెల్లలేదు. ఏడాదికోసారి ఒప్పందం చేసుకుందామని సర్కారు ప్రతిపాదించగా ఐదేళ్లకు తగ్గితే ఒప్పుకొనేది లేదని జీవీకే పట్టుబట్టి సాధించుకుంది.ప్రతి జిల్లాలో 108 సేవలు, వినియోగం, పరిపాలనాపరమైన వ్యవహారాలను పరిశీలించేందుకు పరిపాలనాధికారులు ఉండేవారు. వ్యాన్ల నిర్వహణ సమాచారాన్ని క్రోడీకరించడంలో వీరి పాత్ర కీలకం. కానీ 18 జిల్లాల్లోని ఏవోలను అకస్మాత్తుగా హైదరాబాద్కు బదిలీ చేశారు.క్షేత్రస్థాయిలో వ్యాన్ల నిర్వహణలో జరిగే అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు జీవీకే సంస్థ ఏవో వ్యవస్థనే రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే వారిని హైదరాబాద్కు బదిలీ చేసినట్లు సమాచారం.తక్కువ జీతంతో హైదరాబాద్లో పని చేయలేక... చాలామంది సెలవు పెట్టేశారు. 2009లో జీవీకే సంస్థ 108 బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పథకం ప్రకారం 'దోపిడీ'కి తెరలేపినట్లు తెలుస్తోంది.


