108లను ధ్వంసం చేయనున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 108లను ధ్వంసం చేయబోతోంది. ఆగండాగండి.. ఏదేదో ఊహించుకోకండి.. గత మూడేళ్లుగా పనికి రాకుండా మూలనపడ్డ మూడు వందల 108 అంబులెన్స్‌లను పూర్తిగా ధ్వంసం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా 300 అంబులెన్సుల్లో 255 తుక్కుగా మార్చాలని నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం అవసరాల కోసం కొత్త 108 అంబులెన్స్‌లను కొనుగోలు చేసిన ప్రభుత్వం.. కృష్ణాజిల్లా పెద అవుటుపల్లిలో పాత అంబులెన్స్‌లను ఉంచుతూ వచ్చింది. వీటిలో దాదాపు రెండున్నర లక్షల కిలోమీటర్లు తిరిగిన వాహనాలు దాదాపు 150 వరకు ఉన్నాయి. మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం అవి నడిచేందుకు వీలు లేదు. అందువల్ల వాటిని తుక్కుగా మార్చాలా లేక వినియోగంలోకి తీసుకురావాలా అన్న దానిపై నిపుణులతో కమిటీని వేసింది. ఆ కమిటీ తాజాగా ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.