గోశాలలో వంద ఆవులు మృతి.. ప్రాణం తీసిన పచ్చగడ్డి!

 

విజయవాడ శివారులోని తాడేపల్లి గోశాలలో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో వందకి పైగా ఆవులు మృతి చెందాయి. రాత్రి వరకు ఆరోగ్యంగానే కనిపించిన ఆవులు తెల్లవారే సరికి మృతి చెందాయి. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. దీని పైన గోశాల నిర్వాహకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో పశువులకు పెట్టిన దాణాలో ఏమైనా విష పదార్థాలు కలిశాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. మృతిచెందిన ఆవులకు పోస్ట్‌మార్టం చేసిన తరువాత వాటి మృతికి కారణం చెబుతామని వైద్యులు తెలిపారు. గతంలో కూడా ఇదే గోశాలలో పుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా 24 ఆవులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈసారి ఏకంగా వందకి పైగా ఆవులు మృతి చెందాయి. 100 ఆవులు చనిపోవడంపై గో సంరక్షణ కార్యదర్శి సాహు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధకరమన్నారు. రాత్రి సమయంలో పశువులకు వేసిన దాణా పాయిజనింగ్‌ అయి వుండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఆవులు మృత్యువాత పడిన విజయవాడలోని గోశాలను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, సబ్ కలెక్టర్ మిషా సింగ్ సందర్శించారు. గో సంరక్షణ శాలలో పరిమితికి మించి ఆవులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. మోతాదుకు మించి పచ్చగడ్డి తినడం వల్లనే గోశాలలో అవులు మరణించి ఉంటాయని కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఆవులను చంపి ఉంటే, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంతియాజ్ చెప్పారు.