ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు.. వణికిపోతున్న ఏపీ జనాలు
Published on: Wed Dec 29, 2021 3:10PM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ అధికారులు అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఒమిక్రాన్ కేసులు రాగా.. అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు అధికారులు వివరించారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో ఏపీ జనాలు వణికిపోతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండుగ రానుండటంతో వైరస్ మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జనాలు కచ్చితంగా కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదైన ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. స్కూళ్లు, సినిమా థియేటర్లు బంద్ చేసింది. వాణిజ్య సంస్థలను పరిమితంగానే అనుమతిస్తోంది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో సగం మందినే పర్మిట్ చేస్తున్నారు.


