కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 4 రోజుల్లోనే 10 మంది మృతి!

కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించుకునేందుకు బ్రిటన్ సహా పలు దేశాలు తమ ప్రజలకు అత్యవసర వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా జర్మనీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల వ్యవధిలో 10 మంది మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు జర్మనీ పాల్ ఎర్లిచ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుల బృందం విచారణ మొదలుపెట్టింది. ఈ నిపుణుల చెప్పిన దాని ప్రకారం.. చనిపోయిన పది మంది 79 నుంచి 93 సంవత్సరాల మధ్య వయసులోని వ్యక్తులని తెలిపారు. అయితే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన సమయం నుండి వారు చనిపోయిన సమయం మధ్య వ్యత్యాసం నాలుగు రోజులని వారు తెలిపారు. అంతేకాకుండా చనిపోయిన వారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, బహుశా ఆ సమస్యల కారణంగానే చనిపోయారన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు నిపుణుల బృందంలో ఒకరైన కెల్లర్ తెలిపారు.

 

గడచిన డిసెంబర్ నుండి వ్యాక్సినేషన్‌ పై జర్మనీ ప్రభుత్వం విస్తృతమైన ప్రచారం చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ను జర్మనీలో కూడా ప్రజలకు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 8,42,000 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి దశలో 80 సంవత్సరాల పైన వయసున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఐన వైద్య సిబ్బందితో పాటు కొందరు దేశ సాధారణ ప్రజలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే వీరిలోని 325 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కు లోనయ్యారు. ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజుల్లోనే మరణించిన 10 మంది మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమని ఆ దేశం ఇంకా నిర్ధారించలేదు.