రాజ్యసభ ఎన్నికలకు వైకాపా దూరం!

 

వచ్చిన ఏ అవకాశాన్నివదులుకోవడానికి ఇష్టపడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తనకు సరిపోయినంత మంది శాసనసభ్యుల మద్దతు లేనందున ఫిబ్రవరి 7న జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టడం లేదని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రకటించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర పార్టీల మద్దతు తీసుకొని పోటీకి నిలబెట్టడమంటే విభజన వాదులతో కుమ్మకు కావడమేనని, కాంగ్రెస్, తెరాస, తెదేపాలు విభజనవాదులే గనుక రాజ్యసభ ఎన్నికలలో ఒకరికొకరు సహకరించుకొంటూ పోటీ చేస్తున్నారని ఒక వింత సిద్ధాంతం కూడా కనిపెట్టారాయన.

 

సాధారణంగా ఇటువంటి అవకాశం దొరికితే తన రాజకీయ ప్రత్యర్ధులను ఇరుకునబెట్టి వికృతానందం అనుభవించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఈవిధంగా నీతులు వల్లిస్తూ మడికట్టుకొని కూర్చొంటానని చెప్పడం చాలా అనుమానం కలిగిస్తోంది. రాజ్యసభ ఎన్నికలకు సిద్దమయితే, బహుశః పార్టీలో లుకలుకలు మొదలవుతాయని భయపడిందో లేక మొన్న ఏపీయన్జీవో ఎన్నికలలో వేలు పెట్టి భంగ పడినందున, మళ్ళీ మరోసారి భంగపడకూదదని వెనక్కి తగ్గిందో లేకపోతే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపాల నుండి వైకాపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్ధులకు మద్దతు ఇచ్చి వారిని పార్టీలోకి ఆకర్షించే ఆలోచనలో ఉందో తెలియాలంటే ఈ నెల 28న అభ్యర్ధులందరూ నామినేషన్లు దాఖలు చేసేవరకు వేచి చూడవలసి ఉంటుంది. బహుశః అప్పటికి వైకాపా ఆలోచనలేమిటో బయటపడవచ్చును.